వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజకీయాల్లో బూతులు కామన్. అవి లేకపోతే అసలు రాజకీయ స్పీచ్‌లే ఉండేవి కాదు. అది అసెంబ్లీ అయినా సరే.. జనాల చెవులకు పట్టిన తుప్పును వదలగొట్టేవాళ్లు. చేతల్లోనూ ఏమీ తగ్గేవాళ్లు కాదు . ఎంత ఘోరం అంటే.. కాకినాడ ద్వారంపూడి వంటి వాళ్లు నోటి విరోచనలు చేసుకోవడమే కాకుండా.. మహిళలతో కలిసి మిడిల్ ఫింగర్ చూపించి వెకిలి నవ్వులు నవ్వేవాళ్లు. ఆ వైసీపీ మహిళలు కూడా మిడిల్ ఫింగర్ చూపించేవారు. దానికి అర్థం వారికి తెలుసనుకోవాలో.. తెలియదనుకోవాలో ?
ఐదేళ్ల పాటు వ్యక్తిత్వ హననం చేయడం.. కుటంబాల్ని తిట్టడం మాత్రమే రాజకీయం అన్నట్లుగా సాగిపోయింది. ప్రజలకు కూడా విరక్తి పుట్టింది. వీరినా మనం ఎన్నుకున్నది అని అనుకున్నారు. మరోసారి అలాంటి తప్పు చేయలేదు. ఒక్క సారిగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. స్వచ్చమైన భాష వినిపిస్తోంది. రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్ప.. ఒక్కరు కూడా లుచ్చా భాష మాట్లాడటం లేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జరిగిన నష్టమేంటో తెలుసు..మరోసారి అలాంటి భాష మాట్లాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు .
ప్రజలు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు రాజకీయాలు కూడా కాస్త స్వచ్చంగా కనిపిస్తున్నాయి. లోపల కుట్రలు, కుతంత్రాలు ఎన్ని ఉన్నాయో కానీ బయటకు మాత్రం.. ప్రజల ముందు రాజకీయం గౌరవంగా మారుతోంది. ఇది ప్రజలు తెచ్చిన మార్పు.