ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం… గత అధికార పక్షం మీద అదే పనిగా ఆరోపణల్లో ప్రధానమైనది… దుబారా ఖర్చు. టీడీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం పెట్టినా.. అది దుబారా అని సాక్షి పత్రికలు కథనాలు మీద కథనాలు రాసేవారు. గత ఐదేళ్ల కాలంలో అదే జరిగింది. అందుకే… వైసీపీ గెలిచిన వెంటనే… ఆ పార్టీకి చెందిన నేతలు.. తమ ప్రభుత్వంలో దుబారా ఉండదని.. అంతా పారదర్శకంగా.. పొదుపుగా… ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించారు. కానీ… వారంలోనే… తమ మాటలకు.. చేతలకు పొంతన లేదని నిరూపించేశారు.
ఇఫ్తార్ విందుకి రూ. కోటికిపైగా ఖర్చా…?
రంజాన్ మాసం సందర్భంగా.. ప్రభుత్వం అధికారికంగా.. ఇఫ్తార్ విందు ఇవ్వడం… సంప్రదాయంగా వస్తోంది. ఐదారు వేల మందిని దీనికి పిలుపస్తారు. ఈ సారి గుంటూరులోని పరేడ్ గ్రౌండ్స్‌లో… నిర్వహించారు. అంటే.. అది ప్రభుత్వానిదే దానికేమీ ఖర్చు ఉండదు. కేవలం షామినాలు, విందు కోసం… ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీని కోసం… ప్రభుత్వం అధికారికంగా.. దాదాపుగా రూ. కోటికిపైగా నిధులు విడుదల చేసింది. విందుకు హాజరైన ఐదు వేల మందిని పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపుగా.. ఒక్కొక్కరి ఇఫ్తార్ విందుకు.. దాదాపుగా రూ. రెండు వేలు ఖర్చు చేసినట్లయింది. ఇది అసాధారణం.. అంత ఖర్చయ్యే అవకాశమే లేదు. అయినప్పటికీ.. అంత మొత్తం ఎందుకు విడుదల చేశారో.. ఎందుకు.. ఖర్చు పెట్టారో అధికారవర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇఫ్తార్‌కే రూ.కోటి ఖర్చయితే ప్రమాణస్వీకారానికి ఎంత ఖర్చయి ఉండాలి..?
ప్రభుత్వం తరపున అధికారికంగా.. చాలా పరిమిత కార్యక్రమంగా నిర్వహించిన ఇఫ్తార్ విందుకే.. దాదాపుగా రూ. కోటి ఖర్చు పెట్టినట్లుగా ప్రభుత్వ వర్గాలు జీవో జారీ చేస్తే.. అత్యంత అట్టహాసంగా జరిగినా… ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఇంకెంత ఖర్చయి ఉంటాయన్న చర్చలు సహజంగానే రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి. ప్రమాణస్వీకారానికి అధికారికా ఆహ్వానితులే దాదాపుగా… పదిహేను వేల మంది ఉన్నారు. ఇందులో వీఐపీలే… ఐదారు వేల మంది ఉన్నట్లుగా సమాచారం. వారికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికే కోట్లు ఖర్చవుతుంది. ఈ వివరాలు మొత్తం ప్రభుత్వం బయటపెట్టాల్సి ఉంది.
పొదుపు మాటల్లో కాదు.. చేతల్లో చూపరా..?
తాము అత్యంత నిరాడంబరంగా… పరిపాలన సాగిస్తామని… విజయసాయిరెడ్డి ట్విట్టర్లో గతంలోనే ప్రకటించారు. అందుకే సాక్ష్యంగా.. ఆయన … తాము ఇక హిమాలయ వాటర్ బాటిళ్లు వాడబోమని.. ప్రకటించారు. అదే నిరాడంబరతకు… పొదుపునకు… సాక్ష్యం అయితే.. మరి మిగతా విషయాల్లో ఎందుకంత పొదుపు పాటించరు..! అసలు ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్తే తప్ప జీతాలివ్వలేని పరిస్థితి ఉందని తెలిసి కూడా.. ఎందుకు ఖర్చులు నియంత్రించలేకపోతున్నారు..? దుబారా అధికంగా ఉందని తెలిసి కూడా.. ఎందుకు .. గత ప్రభుత్వంలానే చేస్తున్నారు.. ? ఈ విషయంలో ప్రజల అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత వైసీపీ నేతలదే..!