“మా ఓటర్లు వేరే ఉన్నారు”
మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఆల్ ఇన్ వన్ యాక్టింగ్ చీఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు. బహుశా ఆయన ఉద్దేశం తమకు చదువుకున్న వాళ్లు ఓట్లు వేయరని.. మా ఓటు బ్యాంక్ అంతా చదువురాని నిరక్ష్యరాస్యులని చెప్పడం ఉద్దేశం కావొచ్చు. అందుకేనేమో రాష్ట్రంలో ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. సరి కదా ఇంకా రెచ్చగొడుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అప్పటికీ ఎదురుగా పోరాడుతున్న వారికి ప్రత్యామ్నాయం ఎంచుకునే చాన్స్ లేనట్లు గా మాట్లాడుతున్నారు. వారు జగన్ రెడ్డికి ఓట్లేస్తేనే సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ నుంచుని మాట్లాడగలుగుతున్నారు. ఓట్లేయకపోతే ఓట్లు అడుక్కుంటూ అధికారంలోకి రాగానే పల్లకీలో ఉరేగిస్తామని వారి దగ్గరే మోకాళ్ల మీద కూర్చుని బతిమాలుకుంటూ ఉండేవారు. ఐదేళ్ల కిందట ఈ సమయంలో ఖచ్చితంగా అదే చేస్తున్నారు. వారు ఇచ్చిన అధికారంతో ఇప్పుడు వారినే బెదిరిస్తున్నారు.
ఏపీలో అందరూ ప్రభుత్వ బాధితులే – అందరూ రోడ్డపైనే !
మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మున్సిపల్ కార్మికలు ధర్నా
జిల్లా కోర్టు ఎదురుగా న్యాయవాదుల ధర్నా
గాంధీ పార్క్ ఎదురుగా అంగన్వాడీల ధర్నా
ధర్న చౌక్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగల ధర్నా
ఆశావర్కర్ల నిరసలు, సమగ్రశిక్షా అభియాన్ పొరుగుసేవల ఉద్యోగుల ఆందోళనలు, విద్యుత్ ఇంజనీర్ల సంఘం, ఏఈఈల సంఘం ఆందోళనలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల ఉపాధ్యాయుల సమ్మె… ఇవీ ఇప్పుడు ఏపీలో ప్రతి ఊరిలో కనిపిస్తున్న పరిస్థితులు. ఇవి మాత్రమే కాదు.. కదిలిస్తే ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కి ప్రభుత్వంపై విరుచుకుపడటానికి రెడీగాఉన్నారు. అందరూ బడుగు జీవులే. పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతాలు, పేదలకు అందని విద్య, వైద్యం తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సామాన్యుల నిరసనలు, నినాదాలు హైలెట్ అవుతున్నాయి. అధికార పక్షానికి ఒక్కసారిగా ఉక్కపోత ప్రారంభమైంది. పదిహేను రోజుల క్రితం అంగన్వాడీల సమ్మెతో ప్రారంభమైన ఈ పరిస్థితి రోజురోజుకీ ఉధృతమౌతోంది. ధరాభారం, ఆదాయ పంపిణీలో అసమానతలు సామాన్యులు భరించలేని స్థితికి చేరిన విషయం అంతకు కొద్ది రోజుల ముందునుండే కనిపిస్తున్నప్పటికీ పిల్లికి గంట కట్టిన ఘనత మాత్రం అంగన్వాడీలదే! ఇప్పుడు ఒకరి తరువాత ఒకరుగా సామాన్యులు గళం విప్పుతున్నారు. ఇన్నాళ్లు పంటిబిగువున భరించిన కష్టాలను ఇంకా మోయడం తమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. సమస్యల చిట్టాను సర్కారు ముందు పెట్టి పరిష్కరించి తీర్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం ఇప్పుడు సమ్మె జెండాను ఎత్తింది. ఆందోళనా ప్రదేశ్‌గా, ఉద్యమాంధ్రగా మారింది.
అన్ని వర్గాలూ జగన్ రెడ్డి మాయ మాటలకు మోసపోయిన వాళ్లే !
అంగన్వాడీలు, వారి తరువాత సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. వీరి ఆందోళనలు రోజురోజుకీ తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో వివిధ తరగతులకు చెందిన చిరుద్యోగులు, కార్మికులు కూడా పోరాట పథం వైపు అడుగులు వేస్తున్నారు. ఆశా, విద్యుత్, కెజిబివి, పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన పనిని తమకే అప్పగించి మోపలేని భారాన్ని మోపుతున్నారన్న అసంతృప్తిలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. సమ్మెలో ఉన్న అంగన్వాడీల బాధ్యతలను తమకు అప్పగించడాన్ని వారు బాహాటంగానే తప్పుపట్టారు. అనేక చోట్ల ఆ పనులను చేయడానికి నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరిలో నెలకొన్న అసంతృప్తి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని స్థితి నెలకొంది. గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పాత పెన్షన్ స్కీమ్ అమలు విషయంలో మారిన ప్రభుత్వ వైఖరిపట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. వీరందరి విషయం ఒక తీరైతే వాలంటీర్ల అంశం మరోతీరు. ముఖ్యమంత్రి నుండి మంత్రులు,ఎంఎల్ఏల వరకు వాలంటీర్లకు తమ పార్టీ కార్యకర్తలుగా పదేపదే సర్టిఫికేట్లు ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసిందంటే వారిపై వైసిపి ముద్ర ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఆ వాలంటీర్లే ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేస్తూ సమ్మె నోటీసులు ఇస్తున్నారు. వివిధ తరగతులకు చెందిన శ్రమజీవుల సమస్యలను అర్ధం చేసుకుని పరిష్కరించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం భిన్నమైన వైఖరి తీసుకుంటుండటం ఆందోళనకరం. అంగన్వాడీలతో తాజాగా జరిపిన చర్చలు, బుధవారం నాటి ఆందోళనల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు, విజయవాడలో నిరసన శిబిరాన్ని కూల్చివేసిన వైనం ప్రభుత్వ దమనకాండను నిరూపిస్తున్నాయి.
అణిచివేస్తే ప్రజాగ్రహం చల్లారుతుందా ?
రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని అనుకుంటే ఎన్నికలకు వెళ్లే ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల పథకాలతో గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అన్ని వర్గాలను ముందుగానే బుజ్జగిస్తుంది. ఇందు కోసం కొన్ని పథకాలను పెండింగ్ పెట్టి.. ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి వారు రోడ్డెక్కకుండా చూసుకుంటుంది. ఇదంతా సాధారణ రాజకీయ వ్యూహం. ఎందుకంటే ఎన్నికలకు ముందు తమపై ప్రజల అసంతృప్తి ఉందని ప్రచారం జరిగితే.. మొదటికే మోసం వస్తుంది. అయితే ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఈ వ్యూహం అమలులో వ్యూహాత్మక తప్పిదం చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్కో వర్గం సమ్మె అంటూ తెరపైకి వస్తున్నారు. వీరంతా దిగువస్థాయి ఉద్యోగులు.. ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేసే వాళ్లు కావడంతో వారి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది . అయితే ఇప్పటికీ ప్రభుత్వం వారిని ఏదోవిధంగా బుజ్జగించేందుకు ప్రయత్నించకుండా.. ప్రత్యామ్నాయం చూసుకుంటామని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూండటంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇలా ఆందోళనలు చేస్తున్న వారిలో వాలంటీర్లు ఉన్నా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం జడత్వానికి నిదర్శనం. ఇలా వాలంటీర్లు సమ్మె ప్రారంభించగానే కొన్ని చోట్ల వారికి అధికార పార్టీ నేతలు సర్ది చెప్పి.. సమ్మె నుంచి బయటకు వచ్చేలా చేయగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబరులో నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు. వీరికి ఇటీవలే 750 రూపాయల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చాలా చోట్ల వాలంటీర్లు ఇంకా సమ్మె చేస్తున్నారు. వీరు అంతా సమైక్యంగా లేకపోవడంతో కొన్ని సంఘాలు వాలంటీర్లు సమ్మె చేయడం లేదని ప్రకటించాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ బెదిరింపులు వారి ఉద్యమాన్ని అణిచి వేయగలవు కానీ.. ఓట్లు వేయించగలవా అన్నదే అసలు విషయం.
రోడ్డెక్కిన వారంతా ఏపీ ఓటర్లు కాదా ?
సమ్మెలో ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందించే వివిధ రకాల చిరుద్యోగులు కూడా పాల్గొంటున్నారు. ఇన్ని సమస్యలు చుట్టు ముట్టడం, ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు చేయాల్సిన వారంతా ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటోంది. అయితే వీరి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా.. ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూండటం సమస్యగా మారింది. అందర్నీ కాదని.. ప్రభుత్వం ఎన్నికలకు ఎలా వెళ్లాలనుకుంటోందన్న సందేహం ఎవరికైనా వస్తుంది. అందరూ రోడ్డెకి ప్రభుత్వంపై విరుచుకుపుడుతూంటే్.. ప్రభుత్వాధినేత మాత్రం చాలా కూల్ గా.. తమ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటున్నారు. కుల రాజకయాలు మాట్లాడుతున్నరు. పెన్షన్లు మూడు వేలు తన జేబులోనుంచి ఇస్తున్నట్లుగా.. .రూ. 250 పెంచి అవ్వాతాతలకు..తాను ఇస్తున్నానని..తనకే ఓటు వేయాలని యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకుని ప్రచారం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అసలు ప్రజలకు సేవ చేయాల్సిన వారంతా తమను మోసం చేశారని రోడ్డెక్కుతూంటే.. తమ ఓటర్లు వారు కాదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
ఓట్లు వేయాల్సింది వారే. మరి వారిని కాదని.. ఎందుకు జగన్ రెడ్డి ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సరిపోయే సమాధానం ఎవరు ఎంత మంది రోడ్డెక్కినా చివరికి వాళ్లంతా కులాభిమానంతోనే.. కుల వ్యతిరేకతతోనే చివరికి తమకే ఓటు వేస్తారన్న తెంపరి తనమే కావొచ్చు. కడపు మీద కొట్టినా వారికి కులమే కావాలన్న వారి ఆలోచనలు ఉంటాయని దానికి తగ్గట్లుగానే రాజకీయం చేయాలనుకుంటున్నారు. అందుకే ప్రజలు చులకనైపోయారు. ఈ విషయాన్ని మరి ఓటర్లు గుర్తిస్తారో… అడవిలో ఎన్నికలు జరిగితే.. గొడ్డలి తమ కులానిదని చెట్లన్నీ గొడ్డలికే ఓటేసి వేటేయించుకున్నట్లుగా చేసుకుంటారో వేచి చూడాల్సిందే.