ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టులో విచారణ వీలైనంత ఆలస్యం చేసే వ్యూహాన్ని ఏపీ ప్రభుత్వం అవలంభిస్తోంది. నేటి విచారణలో అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామంటూ హైకోర్టును ఏజీ కోరారు. దాంతో.. హైకోర్టు 24వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అలాగే.. ప్రభుత్వం వేసే అడిషనల్ కౌంటర్లపై తమ వాదనను సమర్పించేందుకు పిటిషనర్లకు 27వ తేదీ వరకు సమయం ఇచ్చింది. తదుపరి విచారణ ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. ఆ తర్వాత ఎవరు గడువు కోరినా ఇచ్చేది లేదని.. విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ తొలగింపు వ్యవహారంపై.. కౌంటర్ దాఖలు చేయడానికి మొదట ప్రభుత్వం తరపు న్యాయవాది నెల రోజుల సమయం అడిగారు. కానీ కోర్టు మూడు రోజులు మాత్రమే ఇచ్చింది.
అయితే.. ఆ తర్వాత మరో రెండు రోజులు గడువు తీసుకున్న ప్రభుత్వ తరపు న్యాయవాది ఐదు రోజులకు కౌంటర్ వేశారు. ఇప్పుడు విచారణకు రాగానే.. అడిషనల్ కౌంటర్ వేస్తామని మరింత గడువు కోరారు. విచారణను ఆలస్యం చేయడానికి వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న విమర్శలు పిటిషనర్ల తరపు న్యాయవాదుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తరపున దాఖలైన కౌంటర్‌కు.. నిమ్మగడ్డ రమేష్ తరపు న్యాయవాది కౌంటర్ వేశారు. ఎస్ఈసీగా రమేష్ కుమార్ స్థానంలో వేరొకర్ని నియమించలేదని.. కేవలం.. సంస్కరణలు తెచ్చామని చెప్పుకున్నారు. దీన్నే రమేష్ కుమార్ ప్రశ్నించారు. అసలు నిపుణుల కమిటీ వేయకుండా.. అర్థరాత్రి ఎలా సంస్కరణలు తెస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి పదవీ కాలాన్ని తగ్గించాలని.. ఏ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయలేదని గుర్తు చేశారు.
తనను తొలగిస్తూ ఇచ్చిన జీవోను..ఆర్డినెన్స్‌ను కొట్టేసి.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కౌంటర్లో కోరారు. ప్రభుత్వం చెబుతున్న ఎన్నికల సంస్కరణల వెనుక దురుద్దేశం ఉందని.. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటే నిపుణుల కమిటీ వేస్తారని… అర్ధరాత్రి సంస్కరణలు తీసుకురారని స్పష్టం చేశారు. ఇతర పిటిషనర్లు కూడా కౌంటర్ వేశారు. ఈ సారి ఇరవై ఎనిమిదో తేదీన ఎవరు వాయిదా కోరినా ఇచ్చే పరిస్థితి ఉండదని.. ఖచ్చితంగా విచారణ జరుపుతామని.. హైకోర్టు స్పష్టం చేయడంతో. .. ఆ రోజు.. మధ్యంతర ఉత్తర్వులు అయినా వస్తాయని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.