ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపెద్దల చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కరెంట్ స్కాం జరిగిందని అదే పనిగా ఆరోపించి.. ప్రమాణస్వీకారం వేదిక పై నుంచే అవినీతి మొత్తం బయటపెడతానని చాలెంజ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వాటి సంగతేమయిందో కానీ ఇప్పుడు… ప్రభుత్వం చేస్తున్న చర్యలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. అనుమానాస్పదంగా మారుతున్నాయి. విద్యుత్ నియంత్రణ మండలి ప్రభుత్వానికి తాజా పంపిన ఓ లేఖ ఇప్పుడు.. సంచలనాత్మకం అవుతోంది. దీనికి కారణం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా… నిలిపివేసి అత్యధిక రేటుకు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడమే.
డిసెంబర్, జనవరి నెలల్లో ఏపీ ప్రభుత్వం బయట నుంచి కరెంట్ కొనుగోలు చేసింది. రోజుకు 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొంటున్నారు. ఇది రాష్ట్రం మొత్తం వినియోగంలో ఇరవై శాతానికిపైగా ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ కొనుగోలు చేయరు. పైగా ఒక్కో యూనిట్ ధరను రూ. మూడున్నర నుంచి రూ. నాలుగు వరకూ పెట్టి కొనుగోలు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నిర్ణయించిన ధర కంటే అధికం. దీన్ని గుర్తించిన విద్యుత్ నియంత్రణ మండలి..డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అధిక ధరకుఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది.
విద్యుత్ నియంత్రణ మండలి వివరణ అడగడానికి ఒక్క రేటు మాత్రమే కారణం కాదు.. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రభుత్వ ప్లాంట్లకు ఉన్నప్పటికీ.. వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి.. మూసి వేసి.. బయట నుంచి కరెంట్ కొంటున్నారు. వాటిని దీర్ఘ కాలం రిజర్వ్ షట్డౌన్లో ఉంచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనిగతంలో విమర్శలు వస్తే ఉత్పత్తి రేటు కన్నా తక్కువ రేటుకు బయట వస్తోందనికొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.కానీ ఉత్పత్తి రేటు కన్నా ఎక్కువ రేటుకు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇదే విమర్శల పాలవుతోంది.