నెలన్నర రోజులు అవుతోంది. ఎండనపడి నడుచుకుంటూ స్వస్థలాలకు పోతున్న వలస కార్మికులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న ఈ సమయంలో.. కార్లు, బైకులు ఉన్న వారందరూ.. ఏదో ఓ పర్మిషన్ చేత పట్టుకుని.. సరిహద్దులు దాటుకుని పోతున్నారు. కానీ.. ఏ వాహనం లేని.. కాళ్లే ఆధారమైన వలస కూలీలు మాత్రం… సరిహద్దులు దాటలేకపోతున్నారు. ప్రభుత్వాలు వారిపై కనీస మానవత్వం ప్రదర్శించడం లేదు.
నగరాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలు ఇప్పుడల్లా పరిస్థితి మెరుగుపడుతుందని.. తమకు ఉపాధి లభిస్తుందని.. నమ్మలేకపోతున్నారు. ఎంత నచ్చ చెప్పినా.. వారు స్వగ్రామాలకే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ శివార్లలో బీహార్ వలస కూలీలు.. అసహనానికి గురై పోలీసులపై దాడులకు పాల్పడటంతో.. ఉన్న పళంగా ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపేశారు. అలా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీల్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వెళ్లేలా కేంద్రం అంగీకారం తెలిపింది. కానీ సమస్య అంతా సరిహద్దుల వద్దనే వస్తోంది. సరిహద్దుల వద్ద భద్రతా సిబ్బందికి ఇష్టమైన వారే వలస కూలీలుగా కనిపిస్తున్నారు. మిగతా వారంతా.. అటు వైపే ఉండాల్సి వస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న తెలంగాణ పౌరులందర్నీ తెలంగాణ సర్కార్ రానిస్తోంది. వైద్య పరీక్షలు చేసి.. ఏమైనా లక్షణాలు ఉంటే.. క్వారంటైన్ కు తరలిస్తున్నారు. లేకపోతే ఇంట్లో క్వారంటైన్లో ఉండాలని పంపిస్తున్నారు.కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఆంధ్రలోకి వచ్చే వారిని అనుమతించడంలేదు. నలభై రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా… ఎక్కడివారు అక్కడే ఉండండి అంటూ.. ప్రకటనలు చేసేస్తున్నారు. కేంద్రం…పర్మిషన్లు ఇచ్చింది. జోన్ల వారీగా సడలింలుపు ఇచ్చింది.ఇలాంటి సమయంలో.. నెలన్నర పాటు .. తమ కుటుంబాలకు దూరంగా ఉన్న వారు.. వెళ్లాలనుకోవడం సహజం. వారిని వెళ్లకుండా ఆపడం బాధ్యతా రాహిత్యమే. వైద్య పరీక్షలు చేసి అనుమతించడమే ప్రధానం.
సొంత రాష్ట్రంలోకి తమను రానివ్వకపోవడం… అనేక మందిని ఆవేదనకు గురి చేస్తోంది. తాము పరాయివాళ్లం ఎందుకు అవుతామని ప్రశ్నిస్తున్నారు. తమకు కరోనా ఉంటే.. ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్లకు పంపించుకోవచ్చు… ఏమీ లేకపోయినా ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తున్నారు. ఇలా వస్తున్నవారంతా.. నెల రోజుల పాటు హోమ్ క్వాంరైటన్ లో ఉన్నవారే. ఏమైనా లక్షణాలు ఉంటే.. వారిలో ఈ పాటికే బయటపడతాయి. ఈ లాజిక్ మిస్సయిన ప్రభుత్వాలు.. ఇప్పటికీ ప్రజల ఆవేదనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు.