తెలుగు సినిమాకు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిత్రాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పలు వరాలు ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న చిత్రాలకు పలు ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రకటించింది. నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించే చిత్రాలను చిన్న సినిమాగా పరిగణిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన వరాల వివరాలు:
- ఏపీలోని ప్రాంతాల్లో చిన్న సినిమాల చిత్రీకరణలకు ఉచితంగా అనుమతులు. అయితే… ముందుగా నిర్మాతలు ఎఫ్డీసీ (ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్)కి కాషన్ డిపాజిట్ చెల్లించాలి. చిత్రీకరణ పూర్తయిన తరవాత ఆ డబ్బును నిర్మాతకు తిరిగి ఇచ్చేస్తారు.
- చిన్న చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు. ప్రస్తుతం సినిమాలపై 19 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అందులోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతాన్ని తొలగించనున్నారు.
- తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన 15 చిత్రాలకు రూ. 10 లక్షల ప్రోత్సాహం. ఏడాదికి 15 చిన్న చిత్రాలకు ఈ నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఆ చిత్రాలను ఎంపిక చేయడానికి త్వరలో కమిటీ వేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందుకోవాలంటే కొన్ని నిబంధనలు వున్నాయి. అవేంటంటే…
- ఏపీలోనే చిన్న సినిమా చిత్రీకరణ చేయాలి. నిర్మాణాంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా అక్కడే చేయాలి.
- సినిమా నిర్మాణ సంస్థ కార్యాలయం ఏపీలో వుండాలి.
<li నటీనటుల పారితోషకం వివరాలు తప్ప మిగిలిన ఖర్చుల వివరాలను ఎఫ్డీసీకి ముందుగా తెలియజేయాలి.
చిన్న చిత్రాల నిర్మాతలు ఈ నిబంధనలను పాటించారా? లేదా? అనేది నిర్ధారించుకున్న తరవాత ఏపీ ప్రభుత్వం రాయితీలు గానీ, నగదు ప్రోత్సహకాలు గానీ ఇస్తుందని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చిన్న సినిమా బతికితే ఎంతోమంది ఉపాధి లభిస్తుందని, అందువల్ల చిన్న చిత్రాలకు అండగా వుండాలని చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.