రూపాయి సంపాదించి రూపాయిన్నర అప్పు చేసేవాళ్లను ఏమంటాం… అప్పుల అప్పారావనే అంటాం. అప్పులు పుట్టినంత కాలం జల్సా చేస్తాడు. తర్వాత దివాలా తీస్తాడు. ఇందులో ఆర్థిక పరమైన సమీకరణాలేమీ ఉండవు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానిదీ ఇదే పరిస్థితి. ఆదాయం కన్నా అప్పులే ఎక్కువ. తొలి రెండు నెలల్లోనే ముఫ్పైవేల కోట్ల లోటు ఏర్పడిందే.. చిన్న విషయమా. ఇప్పటికి ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు మాత్రమే ముగిసింది. ఏడాది మొత్తానికి రూ. ముఫ్పై వేలకోట్ల అప్పునకు ఆర్బీఐ అనుమతి ఇస్తే.. మూడు నెలలు కాక ముందు రూ. ఇరవై రెండు వేల కోట్లు అప్పు తెచ్చేసుకున్నారు. అంతేనా లోటు భర్తీ పేరుతో ఇచ్చిన రూ. పది వేల కోట్లు కూడా వచ్చాయి.
అయినా ఏపీ ప్రభుత్వం ఆదాయం కన్నా అప్పులే చేస్తోంది. ఒక్క ఆర్బీఐ నుంచి చేస్తున్న అప్పులే కాదు.. ఆ రేంజ్ లో బయట నుంచి కూడా అప్పులు చేస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర ఏది కావాలంటే అతి తాకట్టు పెట్టి అప్పులు తెస్తోంది. విశాఖలో ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారో చెప్పడం కష్టం . మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టేశారు. అసలు బయటకు తెలియని తాకట్లు ఎన్ని పెట్టారో కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే ఏదీ బయటపెట్టడం లేదు. ప్రజల్ని కూడా తాకట్టు పెట్టారో లేదో.. కొత్త ప్రభుత్వం వచ్చి రికార్డులు బయటకు తీస్తే కానీ తెలియదు.
మొత్తం అప్పుల మీద నడిపిస్తూ.. అప్పులు వచ్చినంత కాలం జల్సా చేస్తాం.. తర్వాత ఎవడి ఖర్మకు వాళ్లు పోతారాన్నట్లుగా ప్రభుత్వ పెద్దల తీరు ఉంది. రేపు సర్కార్ మారితే.. జల్సాలు చేసిన ఈ ప్రభుత్వ పెద్దలు.. హాయిగా ఉంటారు. వాళ్లకు పోయేదేమీ ఉండదు. కానీ ప్రజలే ఇబ్బంది పడతారు. ఎందుకంటే.. ఈ అప్పులు తీర్చాల్సింది వాళ్లే మరి. ఇలాంటి అప్పుల ఆలోచనల పాలకుల్ని ఎన్నుకున్నందుకు.. పాపం.. ప్రజలు అనుకోవడం తప్ప ఏమీ చేయలేం !