ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రవహించాయని భావిస్తున్న సొమ్ములన్నీ ఏపీ నుంచే వెళ్లినట్లుగా ఈడీ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంలో భారీ కాంట్రాక్టులు పొందిన ఉన్నత వ్యాపార సంస్థలోని కీలక వ్యక్తిని ఈడీ అధికారులు రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. రహస్య ప్రదేశంలో ఆయనను ఉంచి మరీ ప్రశ్నిస్తున్నారు. ఈయన ఏపీ ప్రభుత్వ పెద్దల్లో కొందరికి బంధువు కూడా. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో చాలా కంపెనీలకు రూ. వేల కోట్లు ఈఎండీలు కట్టినట్లుగా తెలుస్తోంది. ఆ సొమ్మంతా ఎక్కడిది ? ఎలా వచ్చింది అన్నది ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో లిక్కర్ పాలసీ భిన్నంగా ఉంటుంది. మొత్తం ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. తయారు చేసేది.. సరఫరా చేసేది.. అమ్మకాలు చేసేది మొత్తం ఓ సిండికేట్. అవడానికి షాపులు ప్రభుత్వానివి. అందులో పని చేసేవాళ్లంతా వైసీపీ నేతల కనుసన్నల్లో ఉండేవారు. అక్కడ డిజిటల్ లావాదేవీలే జరగవు. మొత్తం క్యాష్ ఫ్లో ఉంటుంది. అలా పెద్ద ఎత్తున ఆ క్యాష్ బ్లాక్ మనీగా మారిందని వైట్‌గా చేసుకునేందుకు… ఇలా బడా వ్యాపార సంస్థల్ని వాడుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ లింకులు ఇప్పుడు బయటపడుతున్నట్లుగా భావిస్తున్నారు.
స్కాం జరిగింది ఢిల్లీలో.. లంచాలు అందుకుంది .. ఆ లంచాల సొమ్ము ప్రవహించింది మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారం ఈడీ వర్గాల్లో సంచలనం అవుతోంది. వివరాలు బయటకు తెలియకుండా చేస్తున్న సీక్రెట్‌గా విచారణ చేస్తున్నారు. ముందు ముందు భారీ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మార్చే అవకాశం కనిపిస్తోంది.