ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల మీదనే బండి నడిపించాలని నిర్ణయించుకుంది. వచ్చే మూడు నెలలకు మరో రూ. 14వేల కోట్ల అప్పు కావాలంటూ.. ప్రతిపాదనలను ఆర్బీఐకి సమర్పించింది. ఇప్పటికే మూడు నెలల్లో రూ. 15వేల కోట్ల అప్పును ప్రభుత్వం బాండ్ల రూపంలో సమీకరించింది. వచ్చే మూడు నెలలకు నెలకు.. రూ. ఐదు వేల కోట్లు కావాలని తాజాగా లెక్కలేసుకుంది. కరోనా వైరస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు.. ఆదాయం పడిపోవడంతో.. రుణాలు తీసుకోవడంలో… రాష్ట్ర ప్రభుత్వాలకు పరిమితిని కేంద్రం పెంచింది. అప్పుల విషయంలో.. చాలా దూకుడుగా ఉంటున్న ఏపీ సర్కార్కు ఈ అవకాశం.. అంది వచ్చింది. ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుని అప్పుల కోసం పరుగులు పెడుతోంది.
బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనల కంటే ఎక్కువగా అప్పులు తీసుకు వస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.54,257 కోట్లను అప్పుగా తీసుకుంటామని ప్రతిపాదించారు. తొలి మూడు నెలల్లోనే 15వేల కోట్లు.. తర్వాత మరో మూడు నెలల్లో మరో 14వేల కోట్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా అప్పులు తీసుకుంటూ వెళ్తే.. అది అరవై వేల కోట్లు దాటిపోతుంది. అంటే అప్పుల్లో బడ్జెట్ లెక్కలనూ అధిగమిస్తారన్నమాట. అయితే.. ఇవన్నీ ప్రభుత్వాన్ని నడపడానికి.. అవసరమైన అప్పులు మాత్రమే. అప్పులుగా ఈ నిధులను తీసుకు వస్తున్న ఏపీ సర్కార్.. జీతాలు.. పెన్షన్లు… ఇతర పథకాలకు నగదు పంపిణీ రూపంలో మళ్లిస్తోంది.
బడ్జెట్లో పెట్టిన అప్పులు.. తీసుకుంటున్న రుణాలు.. కేవలం.. బహిరంగ మార్కెట్ రుణాలు. నేరుగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు. ఇక ప్రభుత్వం.. వివిధ రకాల ప్రాజెక్టులు.. ఎస్పీవీలు ఏర్పాటు చేసి.. మరికొన్ని వేల కోట్లు తీసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. విద్యుత్ సంస్థలతో పాటు.. సాగునీటి ప్రాజెక్టులనూ కూడా.. ప్రత్యేక సంస్థలుగా మార్చి… కార్పొరేషన్ల కింద రుణాలుగా తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధి పనులన్నింటికీ అప్పులు తెచ్చుకోవాలని సీఎం జగన్ అధికారులను సమీక్షలు జరిపినప్పుడల్లా ఆదేశిస్తున్నారు. దీంతో… ఏపీ సర్కార్.. ఆదాయం పెంపుదలపై పూర్తిగా దృష్టి తగ్గించి.. అప్పులతో ఎంత కాలం నడిస్తే.. అంత కాలం నడిపించాలని అనుకుంటున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.