ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల్ని అమ్మడానికి సిద్ధమయింది. గత ప్రభుత్వాలు.. హైటెక్ సిటీ.. అమరావతి లాంటి వాటి వల్ల భూముల విలువ పెరిగేలా చేసి.. ఆ భూములు అమ్మి ప్రజల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు అమ్మేవి. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వాలు.. మార్కెట్లు, రిజర్వాయర్లు లాంటి ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూముల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటోంది. ఇలాంటి భూముల్ని అమ్మేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా లేదా అన్నదానిపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉన్నా.. అసలు ప్రభుత్వం … ఆ నిధులన్నింటినీ ఏం చేస్తున్నదానిపై స్పష్టత లేకుండా పోయిందని రాజకీయపార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలేదు. ఈ సమయంలో.. ప్రభుత్వం చేసిన అప్పులు రూ. లక్షన్నర కోట్లు దాటిపోయింది. ఐదేళ్ల కాలంలో టీడీపీ సర్కార్ చేసిన అప్పులు రూ. లక్షా ఇరవై వేల కోట్లు. అంటే.. ఐదేళ్లలో చేసిన అప్పు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే దాటేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు కళ్ల ముందు కనిపిస్తూ ఉండేవి. పోలవరం. అమరావతి పరుగులు పెడుతూ ఉండేది. నిర్మాణ రంగం గొప్పగా ఉండేది. సాగునీటి ప్రాజెక్టులన్నింటిలో పనులు పరుగులు పెడుతూ ఉండేవి. రోడ్ల మరమ్మత్తులు ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. నిర్వహణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించేవారు. అలాగే సంక్షేమ పథకాల్లోనూ లోటు కనిపించేది కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే… రూ. పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేశారు. ఇక డ్వాక్రా మహిళలకు రెండు సార్లు పదివేలు.. రైతులకు అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమలు చేశారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు లేవు. కేవలం జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకే ఖర్చు పెడుతున్నారు. ఇంతోటిదానికి రూ. లక్ష కోట్లకుపైగా అప్పు చేసి.. ఇంకా. పెద్ద ఎత్తున భూముల్ని అమ్మి నిధులేం చేస్తున్నారన్న అనుమానం సామాన్యులకు వస్తోంది. ప్రభుత్వం నిధుల వినియోగం విషయంలో పూర్తి వివరాలు ప్రకటించకోతే.. ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతాయన్న చర్చ నడుస్తోంది. ప్రజోపయోగమైన స్థలాలు.. చివరికి మార్కెట్లు.. చెరువుల కోసం ఉద్దేశించినవి అమ్మడం ప్రజల్లో తీవ్ర చర్చకు కారణం అవుతోంది. ప్రభుత్వం ప్రజల్లో అనుమానాలు తగ్గించకపోతే.. ఇబ్బందులు పడుతుంది.