అదానీకి ఎంత కష్టం వచ్చిన ఆదుకోవడానికి ఏపీ సంపద రెడీగా ఉంది. ఇందు కోసం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్ని ప్రభుత్వ స్థలాలు, పోర్టులు అదానీ పేరు మీద మారిపోయాయో స్పష్టత లేదు కానీ ఇంకా ఇంకా ఇచ్చి వారి కష్టాలను తీర్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. మొన్నటికి మొన్న కేబినెట్ భేటీలో విశాఖలో గతంలో ఇచ్చిన 130 ఎకరాలకు అదనంగా మరో అరవై ఎకరాలు ఇచ్చేశారు. ముందుగా ఇచ్చిన భూముల్ని సేల్ డీడ్ చేయడంతో ఆ 130 ఎకరాలు తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకున్నారు. ఇప్పుడు అరవై ఎకరాలను ఏం చేస్తున్నారో గుట్టుగా ఉంది.
తాజాగా ఏపీ ప్రభుత్వం అదానీ నుంచి బొగ్గు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం టన్నుకు రూ. పదమూడు వేలు మాత్రమే విద్యుత్ సంస్థలు చెల్లించాలి. అదే భారత్ లో ఆ బొగ్గు కొనుగోలు చేయాలంటే రూ. ఐదు వేలు పడుతుంది. అందుకే విదేశాల నుంచి ముఖ్యంగా అదానీ బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల రెండున్నర వేల కోట్ల వరకూ అదనపు భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. అయితే ఇది ప్రారంభమే ముందు ముందు ఈ లెక్క ఎంత పెరుగుతుందో చెప్పడం కష్టం.
ఇప్పటికే అదానీ కి కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ను అప్పగించాలని అనుకున్నారు. కానీ ఆ సంస్థ కు హిండెన్ బర్గ్ దెబ్బ తగలడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. విశాఖలో తీసుకున్న భూముల్లో పెడతామన్న డేటా సెంటర్ కు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. ఇవన్నీ బయటకు తెలిసినవే. తెలియకుండా అదానీ కోసం సీఎం జగన్ ఎన్నెన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో కానీ.. ఆయనను సంక్షోభం నుంచి బయటపడేయడానికి తన వంతుగా … ఏపీ సంపదకు కేటాయిస్తోంది ప్రభుత్వం. ప్రజాధనం.. ప్రభుత్వ ఆస్తులంటే… ఎంత బాధ్యత ఉంటే ఇలా చేస్తారు మరి !