సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంటారు కానీ… ఇచ్చిన పాపాన పోవడం లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న కేటీఆర్… తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చేస్తామన్నారు. అప్పటికి ఆయన ఐదేళ్లుగా అధికారలో ఉన్నారు. అయినా సుప్రీంకోర్టులో కేసు ఉందని… కారణం చెప్పారు. కేసీఆర్ కూడా అదే చెప్పారు. ప్రత్యేకంగా న్యాయనిపుణుల్ని పెట్టి కేసు గెలుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన ఏమీ చేయలేదు. చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఎన్వీరమణ కేసును క్లియర్ చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంత కాలం సుప్రీంకోర్టు కేసును సాకుగా చూపించారు కానీ అది క్లియర్ అయిన తర్వతా ఇవ్వలేదు. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందటే ఒక్కో జర్నలిస్టు రెండు లక్షలు చొప్పు నకట్టారు. వారంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంత మంది చనిపోయారు కూడా. ఇప్పటికే కేటీఆర్ అదే హామీ ఇస్తున్నారు. జర్నలిస్టుల్ని బకరాల్ని చేస్తున్నారు.
ఏపీలోనూ అంతే. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయింది. జర్నలిస్టుల్ని వర్గ శత్రువులుగా ప్రకటించుకుని రాజకీయం చేస్తోంది వైసీపీ. అక్రిడేషన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఇప్పుడు జర్నలిస్టులకు మూడు సెంట్లు ఇస్తామంటూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. వెంటనే… సాక్షి నుంచి ప్రభుత్వం పే రోల్స్ లోకి మారిన కొంత మంది ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికైనా ఇస్తారో లేదో కానీ.. ఏపీ కేబినెట్ తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం సక్రమంగా అమలైన దాఖలాల్లేవు. నిజానికి చంద్రబాబు టైంలో ఓ జర్నలిస్ట్ సొసైటీ ఏర్పడింది. భూమి కూడా కేటాయించారు. కానీ జగన్ రెడ్డి రాగానే దాన్ని క్యాన్సిల్ చేసారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇళ్ల స్థలాలని ఆశ పెడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జర్నలిస్టులు అంటే.. తమకు బాకా ఊదేవార్ని.. తమ దగ్గర చిల్లర తీసుకునే వారనే అనుకుంటున్నారు. వారికి తప్ప ఎలాంటి జర్నలిస్టులకు ప్రయోజనాలు ఇవ్వకూడదని అనుకుంటున్నారు. కానీ మభ్యపెట్టేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ప్రభుత్వానికి బాకా ఊదుతూ… ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేసే జర్నలిస్టులు.. కొంత మంది మాత్రం బాగా వెనకేసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకంతో.. లాబీయింగ్ చేసి పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అసలైన జర్నలిస్టులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.