ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొన్ని నిర్బంధాలను అమలు చేస్తోంది. ఇంగ్లిష్ మీడియం మాత్రమే చదవాలి.. లాంటి నిర్బంధాలు మాత్రమే కాదు.. తాము అమ్ముతున్న మద్యం బ్రాండ్లను మాత్రమే కొనాలనేది.. అందులో ఒకటి. మద్యం డిస్టిలరీలకు… కట్టాల్సిన డబ్బులు కట్టకపోవడంతో.. వారు సరఫరా నిలిపివేశారు. వారు సరఫరా నిలిపివేశారని ప్రభుత్వం.. వారిని బతిమాలి.. సరఫరా చేయించుకోవడం లేదు. వేరే కంపెనీల నుంచి మద్యం నిల్వలు తీసుకొస్తోంది. బ్రాండ్లు ఏవైనా సరే.. అప్పిచ్చే డిస్టిలరీల దగ్గర్నుంచే మద్యం కొంటోంది. వాటినే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకానికి పెడుతోంది. వాటిని అమ్ముకున్న డబ్బులు.. ప్రభుత్వమే వాడుకుంటోంది కానీ.. మళ్లీ డిస్టిలరీలకు కట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం… వచ్చాక.. ప్రభుత్వమే మద్యం అమ్మాలని నిర్ణయించుకుంది. ఆ ప్రకారం… ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. అందులో అన్ని బ్రాండ్లు ఉంచడం లేదు. బాగా పాపులర్ బ్రాండ్లనే ఉంచుతామని మొదటగా ప్రకటించారు. ఇప్పుడు ఆ పాపులర్ బ్రాండ్లు దొరకడం లేదు. ఆ కంపెనీలు.. జే ట్యాక్స్ కట్టడం లేదని.. ఆపేశారని… విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ మంత్రులు మాత్రం… డిస్టిలరీలకు బకాయిలు ఉన్నందున.. వారు సరఫరా చేయడం లేదని అంటున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. ప్రముఖ మద్యం వ్యాపారి. ఆయనకు మెక్‌డోవెల్స్ బ్రాండ్ సహా.. చాలా ప్రముఖ మద్యం బ్రాండ్ల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. ఆయనకు ప్రభుత్వం ఆరు వందల కోట్లు బాకీ ఉందని.. స్వయంగా ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం… మద్యంపై పెద్ద ఎత్తున టాక్స్ వసూలు చేస్తుంది. సహజంగా.. ఓ ఫుల్ బాటిల్ ఖరీదు.. వెయ్యి రూపాయలనుకుంటే.. వాటిని ప్రభుత్వానికి.. మూడు వందల లోపు ధరకే… ఉత్పత్తి సంస్థలు సరఫరా చేస్తాయి. ప్రభుత్వం వెయ్యి రూపాయలకుపైగానే అమ్ముకుంటుంది. అలాంటప్పుడు.. ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం.. వచ్చే ఆదాయంతో పోలిస్తే.. చాలా స్వల్పమే. కానీ ప్రభుత్వం వాటినీ డిస్టిలరీలకు చెల్లించడం లేదు. ఆర్థికంగా ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి. కొసమెరుపేమిటంటే… గత వారం.. తమ దగ్గరున్న మద్యం నిల్వలు తాకట్టు పెట్టుకుని రుణం ఇవ్వాలంటూ ప్రభుత్వం.. కొన్ని ఆర్థిక సంస్థలకు ప్రతిపాదనలు పెట్టింది. అప్పు తెచ్చి.. అమ్మేసుకునే మద్యాన్నీ తనఖా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయడం… చాలా మందిని ఆశ్చర్య పరిచింది.