ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన వారందరిపై ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నారనే కేసులు పెడుతోంది. స్వయంగా ఎస్పీలు కూడా ఇదే చెబుతున్నారు. ఉద్యోగులు ఎవరైనా ప్రభుత్వంపై కుట్ర చేస్తే ఊరుకునేది లేదని.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్పీలుగా రిషాంత్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. పరమేశ్వర్ రెడ్డి నేరుగా ఉద్యోగులకు ప్రభుత్వంపై కుట్ర చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించగా.. మరో ఎస్పీ నేరుగా ఉపాధ్యాయులపై కుట్ర కేసులు నమోదు చేయిస్తున్నారు.
విజయవాడ ఇంటి ముట్టడికి వెళ్లే ఉద్యోగులు సీఎం ఇంట్లోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించాలనుకున్నారని ప్రత్యేకంగా కొంత మంది పేర్లపై నివేదికలు రాయించి… ఆ మేరకు బైండోవర్లు చేస్తున్నారు. ఈ పరిస్థితి చాలా మంది ఉద్యోగులను నివ్వెర పరుస్తోంది. ప్రజాస్వామ్యం దేశంలో తమ డిమాండ్ల కోసం నిరసనలు చేయడం కుట్ర ఎలా అవుతుందని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఎన్నో నిరసనలు చేశాం.. కానీ ఎవరూ కుట్రని అనలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమను ప్రశ్నించడమే కుట్రగా భావిస్తోంది.
అందుకే ప్రతీ ఒక్కరిపై కుట్ర కేసులు పెడుతోంది. జగన్ సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చి.. ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్నికల్లో విజయానికి పెద్ద ఎత్తున వారు సహకరించారు. ఇప్పుడు వారినే కుట్రదారులుగా చూపిస్తోంది వైసీపీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయమని అడగడం కుట్ర అయితే.. ఆ మాట ఇచ్చిన తప్పిన వాళ్లు ఇంకా ఎంత పెద్ద నేరానికి పాల్పడినట్లని వారు ప్రశ్నిస్తున్నారు.