ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆరేడు మంది బడా రెడ్లకు చెందిన సంస్థలకు వందల కోట్ల చెల్లింపులు చేసింది. కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు మాత్రం బిల్లలు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇలాంటి వారి బిల్లులు గట్టిగా ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకూ ఉండవు. వీరంతా చిన్న చిన్న పనులు ముఖ్యంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే రోడ్లు , డ్రైనేజీలు పనులు… కోవిడ్ రోగులకు అన్నం పెట్టడం వంటి పనులు చేశారు. వీళ్లలో కూడా రెడ్డి సామాజికవర్గం వారే ఎక్కువగా ఉన్నారు. అయినా వారికి బిల్లులు మాత్రం రాడం లేదు . దీంతో పనులూ సాగడంలేదు.
ఏదో విధంగా మభ్య పెట్టి … తాము చెబితే ప్రభుత్వం రూ. నాలుగైదు లక్షలు ఇవ్వదా అని.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల పనులు చేయిచారు. వారికి బిల్లులు ఇప్పించలేక తంటాలు పడుతున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులపై ప్రజలు నేతల్ని నిలదీశారు. చిన్న చిన్న పనులకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతూండటం.. మరో వైపు గడప గడపలో ప్రజలు నిలదీస్తూండటంతో చాలా మంది అసహనానికి గురయ్యేవారు. ప్రజలపై విరుచుకుపడేవారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి తలా కొంత చందా వేసుకుని రోడ్లేసుకోవాలన్న సలహాలు ఇచ్చి అభాసుపాలయ్యేవారు.
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది పనులకు నిధుల సమస్య అనేది నాలుగేళ్లుగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రయారిటీ అభివృద్ధి కాదు. సంక్షేమ పథకాలే. ఆదాయం.. అప్పులు.. ఆస్తులు తాకట్టు పెట్టినవి కూడా సంక్షేమ పథకాల అమలుకు వెచ్చిస్తున్నారు. అందుకే అభివృద్ధి పనులకు పెద్దగా నిధులు కేటాయించలేకపోయారు. ఇంత కాలం ఎలాగోలా సర్ది చెప్పుకున్నారు కానీ ఇప్పుుడు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు బరస్ట్ అవుతున్నారు. తాము మళ్లీ ఓట్లు అడుక్కోవాల్సి ఉందని ఇప్పుడైనా చిన్న చిన్న పనులైనా చేయాలని వేడుకుంటున్నారు.