ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎప్పుడూ అనుమానాస్పదమే. వివాదాస్పదమే. చివరికి రాజ్యాంగ పరంగా పెట్టాల్సిన బడ్జెట్ను పెట్టడం లేదు. ఈ కోవలో ఇప్పుడు కొత్తగా మరో సస్పెన్స్ ధ్రిల్లర్ తరహాలో రూ. 1100 కోట్ల చెల్లింపు వ్యవహారం ఇప్పుడు ఆర్థిక శాఖ వర్గాల్లోనే కాదు.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగంలోనూ సంచలనం రేపుతోంది. ఆర్బీఐ కూడా తిరస్కరించినా సస్పెన్స్ ఖాతా పేరిట అసాధారణ రీతిలో చెల్లింపులు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ వ్యవహారం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మార్చి 31వ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు…ఏపీప్రభుత్వం నుంచి ఒకరికి రూ. 1100 కోట్లు బిల్లు చెల్లించాలని పంపారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ ఆర్బీఐ నుంచే జరుగుతాయి. సాధారణంగా ఆర్బీఐ చెల్లింపుల్ని ఆపదు. కానీ సమయం పడుతుంది. ఇక్కడ వెనక్కి పంపింది. కారణం ఏమిటంటే… ఆర్థిక సంవత్సరం ముగిసింది. పాత ఆర్థిక సంవత్సరం ఖాతాలో చెల్లించడం కుదరుదు.. కొత్త ఆర్థిక సంవత్సరం ఖాతాలో చెల్లింపులకు కొత్తగా బిల్లు పంపండి అని సందేశం పంపింది. కానీ ప్రభుత్వం మాత్రం పాత ఆర్థిక సంవత్సరం ఖాతాలోనే చెల్లింపులు చేయాలంటూ పట్టుబడుతోంది. ఆర్బీఐ కుదరదని తేల్చి చెప్పేసింది. దాంతో ప్రభుత్వం సస్పెన్స్ ఖాతా అనే ఆసాధారణ పద్దతిలో పాత ఆర్థిక సంవత్సరం ఖాతాలోనే చెల్లించడానికి ఏర్పాట్లు చేసేసింది.
అసలు ఇప్పుడు వివాదం … అనుమానాలు అనేకం తలెత్తుతున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి క్షణంలో ఎందుకు చెల్లింపులు చేయాలనుకున్నారు..? ఆ చెల్లింపులు దేని కోసం..? కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎందుకు చెల్లించక కూడదు..? ఆర్బీఐ అభ్యంతరం చెప్పినా సస్పెన్స్ ఖాతా పేరుతో పాత తేదీల్లో ఎందుకు చెల్లించాలనుకుంటున్నారు..? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు.. అనుమానాలుగా మారుతున్నాయి. ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ముల్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కానీ దానికి జవాబుదారీ లేకుండా ఇష్టారాజ్యంగా ఇలా చేయడం ఏమిటన్నది ఆర్థిక నిపుణుల ప్రశ్న. కానీ ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.