ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. నవరత్నాల అమలు విషయంలో… ఏ చిన్న లోపానికి తావివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ప్రజల్లో సమాచార లోపం ఏర్పడకుండా.. ఇంకా నవరత్నాలు అందలేదనే భావన ఎవరికీ రాకుండా ఉండేందుకు ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాము మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీకి కటాఫ్ తేదీలు ప్రకటిస్తున్నారు. ఫలానా తేదీ నుంచి ఫలానా రత్నం ప్రజలకు అందుతుందని ప్రకటిస్తున్నారు. మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు.. అధికారులకు తేదీలపై దిశానిర్దేశం చేశారు.
ఎవరెవరికి ఎప్పుడెప్పుడు రత్నాలు అందుతాయంటే..?
సెప్టెంబర్ చివరివారంలో సొంత ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి రూ.10వేల ఆర్థికసాయం
అక్టోబరు 15న రైతు భరోసా పథకంతో రైతులకు రూ. 12,500
నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు, బోట్లకు రూ.10వేల చొప్పున చెక్కులు, మత్స్యకారులకు లీటర్ డీజిల్పై రూ.9సబ్సిడీ
డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24వేలు చొప్పున సాయం
జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమం కింద తల్లులకు రూ. 15వేల పంపిణి
ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు రూ.10వేల ఆర్థికసాయం
ఫిబ్రవరిలో వైఎస్సార్ పెళ్లికానుక చెల్లింపులు
లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు జమచేయనున్నారు. వారి పాత బాకీలకు ఆ నగదను జమ చేసుకోకుండా.. ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పథకాల అమలుకు.., ప్రతీ నెలా.. దాదాపుగా.. ఎడెనిమిది వేల కోట్ల అదనపు ఆదాయం కావాల్సి ఉంటుంది. మాంద్యం కారణంగా ఆదాయం పడిపోయింది. ఈక్రమంలో అవసరమైన మొత్తం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అప్పులపై దృష్టి పెట్టింది. సెప్టెంబర్లోనే కనీసం రూ. 15వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏపీ సర్కార్ ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తేనే.. పథకాలు.. ప్రజలకు చేరువ అవుతాయి.