ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లు సరిపోతాయి.. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదో గొప్ప సంస్కరణగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. గత ఏడాది కాలంగాలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డు రూపంలో పంపిణీ చేయడానికి నిధులు విడుదల చేయడం లేదు. డబ్బులు కట్టకపోవడంతో కార్డులు పంపాల్సిన వారు పంపడం లేదు.
లైసెన్సులు, ఆర్సీలకు కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేశారు. అలా చెల్లించిన ఎవరికీ కార్డులు ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి త్వరలో కార్డులను ఇస్తామని చెబుతున్నారు. ఇక ముందు ఆ డబ్బులు వసూలు చేయబోమని చెబుతున్నారు. సేవలన్నీ ఆన్లైన్ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి, డిజిటల్ రూపంలో పత్రాలు తీసుకొచ్చారు. అయితే డిజిటల్ రూపంలో పత్రాలు తీసుకొచ్చినా… కార్డు ఇవ్వడం మాత్రం ఏ రాష్ట్రామూ ఆపలేదు.
మొబైల్లో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్ ద్వారా కావాల్సిన పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా సరే కానీ స్మార్ట్ ఫోన్ లేకపోతే అనే డౌట్ వస్తుంది… అలాంటి వారు.. నెట్ సెంటర్ కు వెళ్లి పేపర్ పై ప్రింట్ తీసుకుని జేబులో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహనాల్ని తనిఖీలు చేసే ఇలా డౌన్లోడ్ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుందంటున్నారు. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాబట్టి ఇకపై వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల్ని కార్డుల రూపంలో చూపించాల్సిన పనిలేదు. తనిఖీల్లో భాగంగా ఎవరైనా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కార్డు అడిగితే స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్న డాక్యుమెంట్ చూపిస్తే సరిపోతుంది. కార్డులు ముద్రించలేని చేతకాని తనాన్ని ఇలా కవర్ చేసుకుంటున్నారు.