27న రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారత్ బంద్కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని, 3 రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని పేర్ని నాని కోరారు.
రైతుల భారత్ బంద్కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలియచేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ చేశారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వ్యవసాయచట్టాలను పార్లమెంట్లో ఆమోదం పొందడానికి వైసీపీ అనుకూలంగాఓటు వేయడమే ప్రధాన కారణం. రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ బీజేపీకి లేదు. వైసీపీ, బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల మద్దతు అవసరం. వైసీపీ ఈ విషయంలో నిర్మోహమాటంగా మద్దతు తెలిపి చట్టాలను ఆమోదించింది. అయితే బయట మాత్రం ఆ చట్టాలకు తాము వ్యతిరేకమని ప్రకటనలు చేస్తోంది. రైతుల బంద్కు మద్దతిస్తోంది.
వైసీపీ ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరి ఒక్క వ్యవసాయ చట్టాల విషయంలోనే కాదు. ఎన్నార్సీ విషయంలోనూ అంతే. పార్లమెంట్లో ఆమోదం తెలిపి బయట ముస్లింలు ఆందోళన చేసే సరికి .. తాము వ్యతికేరిస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనలకు అర్థం ఏమిటో కానీ వైసీపీని సమర్థించే ముస్లిం నేతలు శభాష్ అన్నారు. కానీ పార్లమెంట్లో ఆమోదించి బయట వ్యతిరేకిస్తే తమను మోసం చేస్తున్నట్లేనని చాలా కొద్ది మంది అనుకున్నారు. రైతు చట్టాల గురించి కూడా అంతే. ఆ కొద్ది మంది గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచించదని రాజకీయవర్గాల్లో సైటైర్లు పడుతున్నాయి.