ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీవోలు జారీ చేసే అధికారం ఎవరికి పడితే వారికి ఉంటుంది. వారు ముందూ వెనుకా ఆలోచించకుండా… జీవోలు జారీ చేసేస్తూంటారు. తర్వాత ఆ జీవోల కారణంగా ఇబ్బందులు పడే అధికారులు నానా తిప్పలు పడి.. ఆ జీవోల వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటామో ప్రభుత్వ పెద్దలకు చెప్పి.. చెప్పించి.. చివరికి జీవోలు వెనక్కి తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఏర్పడ్డాయి. తాజాగా మరోసారి అదే పరిస్థితి .. ఏర్పడింది. కొద్ది రోజుల కిందట… ఏపీ ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే.. వాణిజ్యపన్నులు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్థిక శాఖ పరిధిలోకి.. తీసుకురావడం. నిజానికిఈ జీవోను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
అయితే.. ఎంతో కీలకమైన సంస్కరణ అని.. చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకున్నారు. అందుకే పెద్దగా ఎవరూ స్పందించలేదు.కానీ.. వాస్తవానికి అది కీలకమైన సంస్కరణ కాదు.. ఎవరినీ సంప్రదించలేదు.. ఎవరితోనూ చర్చించలేదు. కానీ జీవో మాత్రం జారీ అయిపోయింది. చివరికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు కూడా తెలియదు. చూచాయగా తెలిసినా దాన్ని ఆయన అంగీకరించలేదు. కానీ జీవో వచ్చేసింది. ఈ జీవో ఇచ్చింది.. సీఎంవో ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్. ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో … సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు కోపం వచ్చింది. దాంతో ఆయన .. ఆ శాఖల్ని ఆర్థిక శాఖలో కలపడం వల్ల చాలా సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రితో మొరపెట్టుకున్నారు.
చివరికి ముఖ్యమంత్రి… సరే అని అనడంతో… ఆయన మరోసారి.. రెవిన్యూ పరిధిలోనే.. వాణిజ్యపన్నులు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఆ జీవోను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలిచ్చారు. దీనికి చెప్పిన కారణం ఏమిటంటే… ఖర్చులు తగ్గించుకోవడానికి ఏపీ ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలో కమిటీ వేసిందని… ఆ కమిటీ పని సులువయ్యేందుకు ఈ నిర్ణయాన్ని నిలిపివేశారట..! కవర్ డ్రైవ్‌లు కూడా… ఇలా కామెడీగా ఆడితే.. ప్రజలు నవ్వుకుంటారని ఏపీ అధికార పార్టీ నేతలు.. ఎందుకు ఊహించడం లేదో మరి..!