తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల పంటలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే ఏపీ సర్కార్ మాత్రం.. ఒక్క వరిని మాత్రమే కొనుగోలు చేస్తోంది. జొన్న, మొక్కజొన్న, పసుపు పంటల కొనుగోలు మందకొడిగా సాగుతోంది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ… చురుగ్గా సాగడం లేదు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టినిధుల సమస్య రాలేదు. అలాగే జొన్న, మొక్కజొన్న, పసుపు వంటి పంటలను కొనుగోలు చేయడానికి కూడా.. మార్క్ ఫెడ్‌కు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ రుణం ఇస్తుంది. ఈ సారి అ రుణం మార్క్ ఫెడ్‌కు దక్కలేదు. ఈ పంటలను కొనుగోలు చేయడానికి రూ. రెండు వేల కోట్లు కావాలని… ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తుందని… జాతీయ సహకారభివృద్ధి సంస్థకు.. లేఖ రాశారు.
అయితే.. తిరుగుటపాలో… రుణాల చెల్లింపులో ఏపీ సర్కార్ డిఫాల్టర్ అయినందున.. ఎలాంటి రుణం మంజూరు చేయలేమనే సమాధానం.. వచ్చింది. సహకార చక్కెర కార్మగాల కోసం.. గత ప్రభుత్వం… జాతీయ సహకారాభివృద్ధి సంస్థ నుంచి రూ. 200 కోట్ల రుణం తీసుకుంది. ఆ రుణాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్చాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి .. అధికారం చేపట్టిన తర్వాత ఆ రుణం తీర్చే ఆలోచన చేయలేదు. దాంతో ఆ రుణం అలాగే ఉండిపోయంది. జాతీయ సహకారాభివృద్ధి సంస్థ.. ఒకటికి రెండు సార్లు రుణం గురించి గుర్తు చేస్తూ ఏపీ సర్కార్ కు లేఖ రాసింది కూడా. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రుణం పెండింగ్ లో ఉండగా మరో రుణం ఇవ్వరని.. ఊహించలేకపోయిన ఏపీ సర్కార్.. రూ. రెండు వేల కోట్ల రుణ ప్రతిపాదనలు పంపింది.
దీంతో.. పాత రుణం చెల్లించకపోవడంతో..ఏపీ సర్కార్ ను డిఫాల్టర్ల జాబితాలో చేర్చామని పాత రుణాలను క్లియర్ చేసిన తర్వాత కొత్త రుణ దరఖాస్తులను పరిశీలిస్తామని.. స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఎస్బీఐ, నాబార్డు కూడా.. ఇలాగే.. పాత రుణాలు చెల్లించకుండా.. కొత్త రుణాలు ఇవ్వలేమని ఏపీ సర్కార్ కు సమాచారం ఇచ్చాయి. ఏ ప్రభుత్వం అయినా… పాత రుణాలు చెల్లిస్తూ.. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తాయి. అయితే.. జగన్ సర్కార్.. గత ప్రభుత్వం చేసిన రుణాలతో సంబంధం లేదన్నట్లుగా ఉంటూ.. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తూండటంతో సమస్యలు వస్తున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.