ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. గత సర్కార్ రివర్స్ విధానాల నుంచి బయటపడేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుతుంది. రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు వెనక్కి లాక్కెళ్లిన అవినీతి నిర్ణయాల్లో రివర్స్ టెండరింగ్ ఒకటి. దీని దెబ్బకు.. తమకు కావాల్సిన వారికే కాంట్రాక్టులు దక్కేలా చేసుకోవడంతో పాటు.. న్యాయవ్యవస్థకూ మరక అంటించేందుకు ప్రయత్నించారు. న్యాయసమీక్ష పేరుతో తాము చేస్తున్న పనులకు… న్యాయముద్ర వేసుకున్నారు.
నిజానికి ఈ రివర్స్ టెండరింగ్ … తమ కలెక్షన్ల కోసం గత పాలకులు తెచ్చింది. అప్పట్లో జరుగుతున్న పనులు కూడా ఆపేసి మరీ రివర్స్ టెండరింగ్ తెచ్చారు. చివరికి పోలవరం టెండర్లకూ అదే పని చేశారు. ఐదేళ్ల కిందట ఏ ధరలకు పని చేయలేమన్నారో.. అంత కంటే తక్కువ ధరకు ఐదేళ్ల తర్వాత పనులు చేస్తామని రివర్స్ లో మేఘా కంపెనీ పనులు దక్కించుకుంది. ఎలా చేస్తారని ఎవరూ అడగలేదు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం రిస్క్ లో పడిపోయింది. పనులు చేసిందే లేదు. ఇలా చెప్పుకోవాలంటే.. మొత్తం టెండర్లను రివర్స్ చేశారు. ఒక్క పనీ పూర్తి కాలేదు. చాలా వరకూ కమిషన్లు తీసుకున్నారు.
ఇతర కాంట్రాక్టుల విషయంలో అయితే దొంగ తెలివి తేటలు బాగానేచూపించారు. కనీసం వంద కోట్లు దాటిన టెండర్లకే న్యాయసమీక్ష అవసరం అని చెప్పారు. వంద కోట్లు దాటిన వాటిని రెండు, మూడుగా విభజించి టెండర్లు ఇచ్చేవారు. ఇలాంటి అవినీతి వేషాలు లెక్కలేనన్ని వేశారు. న్యాయసమీక్షకు వెళ్లిన వాటి విషయంలో ఎన్నో ఉల్లంఘనలు జరిగాయి. తాము చేస్తున్న అవినీతికి.. న్యాయవ్యవస్థ అనుమతి ఉందనే ముద్ర వేయడానికే జగన్ ఈ పని చేశారు. రాష్ట్రానికి చేటు చేసిన నిర్ణయాల్లో ఈ రివర్స్ టెండరింగ్ ఒకటి.
ఎవరికి కావాలంటే వారికి టెండర్లు ఇచ్చుకోవడానికి… కమిషన్లు బేరం అడటానికి ఈ రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చారు. ఈ విధానాన్ని దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ జగన్ రెడ్డి మాత్రం… ధరలు పెంచి.. మద్యం తాగేవాళ్లను తగ్గిస్తానని చెప్పినట్లుగా… రివర్స్ టెండర్లతో డబ్బులు ఆదా చేయడం కాదు.. మొదటికే రాష్ట్రాన్ని ముంచేశారు. ఇప్పుడీ విధాలను తొలగిస్తూ… రాష్ట్రం మెల్లగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.