ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సమాచారం పంపారు. ప్రతీ నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖకు సంబంధించి ప్రతి నెలా జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికల ఆధారంగానే తాను రిపోర్టులు తయారు చేసి కేంద్రానికి పంపుతానంటున్నారు. ఇలా గవర్నర్ అడిగిన విషయాల్లో శాంతిభద్రతల అంశం కూడా ఉంది.
గత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇలా చేయలేదు. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెట్టేవారు. ప్రభుత్వం తీసుకున్న చట్ట , రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోయాయి. దీనికి గవర్నర్ గా ఉన్న హరిచందన్ సిగ్గుపడలేదు. ఆయన బదిలీపై వెళ్లే ముందు కూడా… కోర్టు తీర్పును ఉల్లంఘించి చేసిన రాజధాని భూముల్లో ఆర్-5 జోన్ చట్టాన్ని కూడా ఆమోదించారు . అయితే ప్రస్తుత గవర్నర్ మాత్రం… అన్నింటినీ పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ నెలా రిపోర్టులు అడుగుతున్నందున… అన్ని అంశాలపై గవర్నర్‌కు స్పష్టత ఇవ్వాల్సిందేనని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేవు ఆయన ఇప్పటి వరకూ ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కానీ ఇలా నివేదికలు అడిగితే.. చాలా వరకూ ప్రభుత్వ లోపాలు బయటకు వస్తాయి. ఆయన వాటిని ఎలా ప్రశ్నించకుండా ఉంటారనేది ఇక్కడ కీలకం. ఒక వేళ అలా ప్రశ్నిస్తే మాత్రం ఏపీ ప్రభుత్వాధినేతకు కోపం వస్తుంది. అప్పుడేం జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నివేదికలు అన్నీ కావాల్సినట్లుగా ఇస్తే సరిపోతుందిగా అనే దగ్గరి దారి ఉన్నా… అవాస్తవాలు…. నిజాలు దాయడం వంటివి చేస్తే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌కు కోపం రాదా ?