ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా మొత్తం ఫద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి.. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు.. కనీసం నోటీసులు ఇవ్వకుండా.. ఎఫ్ఐఆర్ చూపించకండా అరెస్ట్ చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. స్వయంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గవర్నర్ గా ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం మరింత చర్చనీయాంశం అవుతోంది. గవర్నర్ స్పందన ఎలా ఉంటుందోనని న్యాయవర్గాలు ఎదురు చూస్తున్నాయి.
సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వర్ రావు సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ పై .. ఓ వివరణాత్మక ట్వీట్ చేశారు. అసలు ఆ కేసులో సాక్ష్యాలు ఉన్నాయా లేవా అన్న సంగతిని పక్కన పెడితే అసలు అరెస్ట్ చేసిన విధానమే తప్పని ఆయన స్పష్టం చేశారు. అది ఇల్లీగల్ అరెస్ట్ అని స్పష్టం చేశారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఏసీబీ కేసులు. ఆ కేసుల్లో ప్రజాప్రతినిధులపై .. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా విధులు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అని ఏసీబీ చట్టాల్లో ఉన్నాయి. గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదని తెలుస్తోంది.
ఉదయం నుంచి మీడియాలో జరుగుతున్న హడావుడి చూసే రాజ్ భవన్ కు తెలిసినట్లయింది. మరో వైపు చంద్రబాబు తరపున వాదించేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్ సిద్దార్థ లూధ్రా విజయవాడ వచ్చారు. అమరావతి కేసుల్ని ఆయనే ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసినట్లుగా కనిపిస్తూండటంతో.. ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుందన్న ఆసక్తి ఏర్పడింది.