అమరావతిని అభివృద్ధి చేస్తామన్న సింగపూర్ కంపెనీకి డోర్స్ చూపించారు..!
రూ. 70వేల కోట్ల పెట్టుబడితో వస్తున్న ఆదానిని హైదరాబాద్‌లో ఆపేశారు..!
తిరుపతికి బయలుదేరిన అంబానీ జియోకు ఇక్కడ సిగ్నల్ అందకుండా చేశారు..!
విశాఖలో ప్రపంచస్థాయి మాల్‌ను కడతామన్న లూలూకి ఉక్కపోతకు గురి చేసి.. ఏపీ వైపు రాలేమని స్టేట్మెంట్ ఇచ్చేలా చేశారు..!
ఇవన్నీ.. దేశ, విదేశీ కంపెనీలు కావొచ్చు కాబట్టి.. లైట్ తీసుకున్నారు. కానీ “మన” కంపెనీని మాత్రం… ఏపీ సర్కార్ పెద్దలు ఒడిసి పట్టేశారు. తీసుకొచ్చి 120ఎకరాలు కట్టబెట్టేందుకు అంగీకరించారు. ఎకరం రూ. ఆరు లక్షలు మాత్రమే. పరిశ్రమలకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలు కూడా అదనం.
అనంతలో వీరవాహన్ ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ..!
అనంతపురం జిల్లా గూడవల్లి అనే గ్రామంలో వీరవాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి ఏపీ సర్కార్ ఎకరానికి రూ. ఆరు లక్షల చొప్పున 120ఎకరాలు కేటాయించింది. అక్కడ.. ఈ కంపెనీ రూ. వెయ్యి కోట్లు పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ.. పోవడమే కానీ.. రావడం అంటూ.. ఒక్కటి కూడా జరగలేదు. ఈ క్రమంలో.. ఈ వీరవాహన్ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రావడంతో.. మంత్రి గౌతం రెడ్డి.. చాలా ఘనంగా ప్రకటించారు.
కంపెనీ టర్నోవర్ రూ. 85 కోట్లు..! రూ. వెయ్యి కోట్లతో పరిశ్రమ..!
వీరవాహన్ ఉద్యోగ్ లిమిటెడ్‌ను.. కోగటం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 2004లో బెంగళూరులో ప్రారంభించారు. ఈ కంపెనీ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను నిర్వహిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఈ కంపెనీ టర్నోవర్ రూ. 85 కోట్లు. కంపెనీ నెట్ వర్త్ రూ. 125 కోట్లు. కానీ.. అంతకు పది రెట్లు .. పెట్టుబడి పెడతామని ఏపీ సర్కార్ కు ప్రతిపాదన పెట్టింది. అదీ కూడా బాడీ బిల్డింగ్ యూనిట్ కాదు. ఏకంగా.. ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేస్తామని ప్రతిపాదించింది. దీనికి ఏపీ సర్కార్ అంగీకరించింది. 120 ఎకరాలను .. కేవలం రూ. ఎనిమిది కోట్లకే అప్పగించింది.
2017లో బస్ బాడీ యూనిట్ ప్రతిపాదన..! ఇప్పుడు బస్ ఫ్యాక్టరీ..!
నిజానికి ఈ కంపెనీ 2017లోనే ఏపీ సర్కార్ వద్ద ఓ ప్రతిపాదన పెట్టింది. అనంతపురంలోనే.. బస్ బాడీ యూనిట్ ను పెడతామని ముందుకొచ్చింది. సీరియస్‌గా లేదో.. మార్కెట్ పరిస్థితులు అనుకూలించలేదో కానీ.. తర్వాత ముందుకు రాలేదు. మళ్లీ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత రంగంలోకి వచ్చింది. ఈ సారి బస్ బాడీ యూనిట్ ను కాకుండా.. ఏకంగా బస్సుల్నే ఉత్పత్తి చేస్తామని ప్రకటించుకుంది. 120 ఎకరాలు పొందింది.
మరో లేపాక్షి అవుతుందా..? కియా అవుతుందా..?
అనంతపురం జిల్లాలో ఇప్పుడు భూముల ధరలు చాలా పెరిగాయి. కియా పరిశ్రమతో అనంతపురం రూపురేఖలు మారిపోతున్నాయి. బెంగళూరుకు సమీపంలో ఉండటంతో.. ధరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో.. 120 ఎకరాలు ప్రభుత్వం “మన” కంపెనీకి కట్టబెట్టడంతో..అందరిలోనూ ఓ రకమైన అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. వైఎస్ సర్కార్ హయాంలో లేపాక్షి వంటి కంపెనీలను ప్రకటించి.. వందల ఎకరాలు కేటాయించారు. వారి ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు కానీ.. కంపెనీలు పెట్టలేదు. చంద్రబాబు హయాంలో.. కియా లాంటి పరిశ్రమలు వచ్చాయి. ఫ్యాక్టరీలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ వీరవాహన్.. ఏ కేటగిరికి వస్తుందోనన్న సందేహం చాలా మందిలో ప్రారంభమయింది.
ఫ్యాక్టరీ నిర్మాణం కాకపోతే నాటి స్కాంలు మళ్లీ ప్రాంభమయినట్లే..!?
ఎలక్ట్రిక్ బస్సుల మార్కెట్ ప్రస్తుతం డల్ గా ఉంది. పోటీ కూడా భారీగా ఉంది. పెద్ద ఎత్తున కంపెనీ బస్సుల ఉత్పత్తి కోసం యూనిట్లు రెడీ చేసుకున్నాయి. అశోక్ లేలాండ్… విజయవాడ సమీపంలో ఓ యూనిట్ ను రెడీ చేసింది. కానీ డిమాండ్ లేక.. ఉత్పత్తి ప్రారంభించలేదు. మరి ఈ రూ. 125 కోట్ల నెట్ వర్త్ మాత్రమే ఉన్న వీరవాహన్.. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడిని ఎలా సమీకరించుకుంటుంది..? ఎలా ఉత్పత్తి చేస్తుంది.? దిగ్గజ కంపెనీలను తట్టుకుని.. ఎలా మార్కెట్లోకి వస్తుంది..? అన్నది మార్కెట్ వర్గాలకు ఉన్న సందేహం. ఆలూ లేదు.. చూలూ లేదు.. అక్కడి దాకా ఎందుకని.. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు.