సీఎం జగన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. వచ్చిన వెంటనే కేబినెట్ భేటీ బెట్టి … ఐబీ సిలబస్ పేరుతో జపం చేస్తున్నారు. కేబినెట్ సమావేశం ముగియగానే.. వర్చువల్ పద్దతిలో ఎంవోయూ కూడా చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడాగా ఉందే అని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఐబీ సిలబస్ పేరుతో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత… ఆ ఎంవోయూ చేసుకుంటున్న వారికి ఎంత ఇస్తున్నారు… వారు ఇచ్చే సేవలేమిటి… అసలు మన దగ్గర ఐబీ సిలబస్ పెట్టేందుకు ఇన్ ఫ్రా ఉందా అలాంటివేమీ మదింపు చేసిన దాఖలాలు కూడా లేవు.
గతంలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లి రాగానే… బైజూస్ తో ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడి నుంచి ప్రతిపాదనలు రాకుండానే పిల్లలకు ట్యాబ్లు ఇస్తామని దోపిడీ చేసి పడేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బైజూస్ దివాలా స్థితిలో ఉంది. అయినా కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు పెట్టి… వందలకోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఐబీ వంతు వచ్చింది.. ఏపీలో అరవై రెండు వేల ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ఐబీ సిలబస్ ప్రవేశ పెడతారు. మరి సీబీఎస్ఈ , బైజూస్ సంగతేంటి ?. ఎవరికీ తెలియదు.
ప్రభుత్వ బడుల్లో చదివేది పేద పిల్లలే. వారు ఇప్పటికే నలిగిపోతున్నారు. ఉపాధ్యాయ నిమాయకాల్లేవవు. ఉన్న వారికి ట్రైనింగ్ లేదు. ఓ సారి ఇంగ్లిష్ మీడియం.. ఇంకోసారి సీబీఎస్ఈ.. ఇంకోసారి బైజూస్.. ఇప్పుడు ఐబీ . ఈ ప్రయోగాలతో లక్షల మంది చదువు మధ్యలో ఆగిపోయేలా.. పాస్ పర్సంటేజీ తగ్గిపోయేలా చేశారు. ఐబీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంగ్లిష్ మాతృభాషగా ఉండే దేశాల్లో ఉండే కరికులం. అది కూడా అభివృద్ధి చెందలేదు. ప్రపంచవ్యాప్తంగా 5600 స్కూళ్లలోనే ఉంది. ఇండియాలో అయితే రెండు వందల స్కూళ్లలో కూడా లేదు. కానీ ఏపీలో 62వేల స్కూళ్లలో ఏర్పాటు చేస్తారట.
ఐబీ కరికులం అంటే.. ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ . స్విట్టర్జ్లాండ్కు చెందిన కొంత మంది టీచర్స్ తయారు చేసిన ప్రత్యేకమైన కరికులం ఇందులో ఉంటుంది. ఇదంతా ప్రాక్టికల్ విద్య. పరీక్షలు అనేవి ఉండవు. ర్యాంకులు, మార్కుల గొడవ ఉండదు. మరి ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి మెడిసిన్, ఐఐటీల్లో చేరాలంటే ర్యాంకులుకావాలి. ఇది ఇండియాలో ముఖ్యంగా ఏపీలో ఎలా వర్తింప చేయగలరో.. జగన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది. కానీ రాసిచ్చింది చదివే ఆయనకు దీని గురించి అవగాహన ఉండే అవకాశం లేదు. ఐబీ కరికులం కేవలం ఓ ప్రత్యేకమైన వ్యవస్థలోనే ఇముడుతాయి. గవర్మెంట్ స్కూళ్లకు అసలు సరిపడవని నిపుణులు చెబుతున్నారు.
కానీ పిల్లల భవిష్యత్ ను తాకట్టు పెట్టేసి జగన్ రెడ్డి ఏదో మాయ చేస్తున్నారన్న అనుమానం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. అదేమిటో ఒప్పంద పత్రాలు బయటకు వస్తే తప్ప ఎవరికీ తెలియదు.