ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా అటానమస్ కాలేజీలపై దృష్టి సారించింది. అవి సొంతంగా పరీక్షలు పెట్టుకోవడానికి లేదని… జేఎన్టీయూ ద్వారా తామే పెడతామని ప్రకటించేసింది. ప్రభుత్వ ప్రకటన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. విద్యా రంగానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్న నిపుణులు… ప్రముఖులు.. మంత్రి.. ముఖ్యమంత్రికి అటానమస్ కాలేజీలంటే అర్థం తెలుసా..?అని విద్యారంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆ అటానమస్ కాలేజీలకు అసలు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉండదని.. అవన్నీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటాయని పలువురు గుర్తు చేస్తున్నారు. సిలబస్ అయినా.. క్లాసులు అయినా .. పరీక్షలు అయినా .. యూజీసీ నిబంధనల ప్రకారమే.. అ అటానమస్ కాలేజీలు పని చేస్తూంటాయి. అటానమస్ అంటే స్వయంం ప్రతిపత్తి ఉండటం. అంటే… ఆయా కాలేజీలు పూర్తిగా సొంత కరికులం ఏర్పాటు చేసుకుని … విద్యను అందిస్తూ ఉంటాయి.
ఇలాంటివి ఏపీలో 109 వరకూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు వాటికి అవి పరీక్షలు నిర్వహించుకోడం సాధ్యం కాదని… పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావాలంటే… క్వాలిటీ విద్య అందాలంటే.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిందేనని నిర్ణయించుకుంది. జేఎన్టీయూ ద్వారా పరీక్షలు పెడతామంటున్నారు. ఏ నిబంధనల కింద పెడతారో మాత్రం చెప్పలేకపోతున్నారు. అటానమస్ కాలేజీలు తమ ఆదేశాలను పట్టించుకోవనో.. లేకపోతే కోర్టుకు వెళ్తాయనో… విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అనుమానం వచ్చింది. అందుకే కోర్టుకు వెళ్లినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కాలేజీలు రాష్ట్రంలోనే ఉంటాయని… విద్య ఉమ్మడి జాబితాలో ఉందని.. తాము కూడా చట్టాలు చేస్తామని చెప్పుకొచ్చారు. నిజానికి విద్య ఉమ్మడి జాబితాలో ఉంది…కానీ స్పష్టమైన తేడా ఉంది.
ప్రాథమిక విద్య స్కూళ్లు.. ఏపీ ప్రభుత్వానివి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాభవన్ స్కూళ్లూ ఉంటాయి. ఏపీలో ఉన్నాయి కాబట్టి వాటిపైనా తాము అజమాయిషీ చేస్తామంటే కుదరదదని కొంత మంది విద్యారంగ నిపుణులు అంటున్నారు. అప్పుడు అటానమస్ కాలేజీలపై పెత్తనం చేస్తామంటున్న ప్రభుత్వం తీరు అలాగే ఉందంటున్నారు. గీతం లాంటి కొంత మంది టీడీపీ నేతల అధీనంలో ఉన్న విద్యా సంస్థల్ని టార్గెట్ చేసుకుని ప్రభఉత్వం ఈ నిర్ణయం తీసుకుందని… న్యాయపరంగా చెల్లదని నిపుణులు చెబుతున్నారు.