ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటో తేదీ వస్తోందంటే.. టెన్షన్ పట్టుకుంటోంది. జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్ల కోసం.. ఒకటో తేదీ కల్లా రూ. పది వేల కోట్ల వరకూ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ తేదీ దగ్గర పడుతూండటంతో.. నిధుల కోసం.. వేట ప్రారంభించింది. అయితే.. ఎప్పట్లాగే ఆర్బీ వద్ద బాండ్లు వేలం వేసి తెచ్చుకుందామని .. ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈ సారి ఆర్బీఐ అలాంటి అవకాశం లేదని చెప్పేసింది. నిబంధనల మేరకు..తీసుకోవాల్సిన అప్పును ఇప్పటికే తీసేసుకున్నారని.. ఇక తీసుకోవడం కుదరదని చెప్పేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి టెన్షన్ ప్రారంభమయింది. ఉన్న మార్గాలను అన్నీ వెదుక్కుంటే.. ఎక్కువ అప్పు తీసుకోవడానికి చట్టాన్ని సవరించడమే మార్గమని.. నిర్ణయించుకుంది.
ఎఫ్ఆర్బీఏం చట్టం ప్రకారం.. రాష్ట్ర జీఎస్డీపీలో మూడు శాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. ఇప్పటికే ఆ మొత్తం తీసేసుకున్నారు. దాంతో… ఎఫ్ఆర్బీఎం చట్టంలో.. ఐదు శాతం వరకూ రుణాలు తీసుకునేలా మార్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా పెంచడానికి హుటాహుటిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైల్ మీద సంతకం చేసింది. ఇతర మంత్రుల సంతకాలు కూడా తీసుకున్నారు. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ కోసం.. గవర్నర్ వద్దకు ఫైల్‌ను పంపారు. ఆర్డినెన్స్ జారీ అయితే.. కేంద్రం దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదించిన తర్వాత ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
గత రెండు, మూడు నెలల నుంచి ఆర్బీఐలో వారానికి రూ. రెండువేల కోట్ల బాండ్లను వేలంం వేయడం ద్వారా.. నిధులు సమకూర్చుకుని జీతాలిస్తున్నారు. దీని వల్ల ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలొస్తున్నాయి. కరోనా కారణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు.. అప్పుల విషయంలో.. కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది. ఎఫ్ఆర్బీఏం పరిమితి ఐదు శాతం వరకూ పెంచుకునే చాన్సిచ్చింది. కానీ.. కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు అన్నింటినీ ఏపీ సర్కార్ అమలు చేయాల్సి ఉంది. కానీ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారం చూస్తే.. ఏపీ జీడీపీ పూర్తిగా తగ్గిపోయింది. ఆ ప్రకారం.. అంచనా వేసినా.. కొత్తగా అప్పులను ఆర్బీఐ కూడా ఇవ్వకపోవచ్చని అంటున్నారు. కానీ ఏపీ సర్కార్ ఉన్నత స్థాయి ప్రయత్నాలు చేస్తోంది. ఎఫ్ఆర్బీఐ పరిమితి పెంచుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోద ముద్ర లభించేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సక్సెస్ అయితేనే సకాలంలో జీతాలు, పెన్షన్లు అందుతాయి.. లేకపోతే కష్టమే..!