దేశంలో ఎన్నో ఆర్థిక సంస్థలు ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించి.. బోర్డు తిప్పేశాయి. కేసులు నమోదు చేసి.. ఆయా సంస్థల ఓనర్లనీ అరెస్ట్ చేసి ఉంటారు కానీ.. ఒక్క రూపాయి అయినా డిపాజిటర్లకు తిరిగి ఇప్పించిన సందర్భాలు దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు. దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. కానీ.. ఇప్పుడు.. అగ్రిగోల్డ్ విషయంలో మాత్రం ప్రభుత్వం డిపాజిటర్లకు సొమ్ములు చెల్లించాలని నిర్ణయించింది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ వద్ద రూ.10వేల లోపు డిపాజిట్చేసిన బాధితులకు తొలుత చెల్లింపులు చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది.
అగ్రిగోల్డ్ దేశ వ్యాప్తంగా 32లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. ఈ మొత్తం ఆరేడు వేల కోట్లు ఉండవచ్చని అంచనా. ఏపీలో ఏపీలోనే 10లక్షలకు పైగా డిపాజిటర్లు ఉంటారు. వీరిలో మూడు లక్షల మంది రూ. పది వేల లోపు డిపాజిట్ చేసిన వారు. ప్రస్తుతం కోర్టు పర్యవేక్షణలో… అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ సాగుతోంది. కానీ… ప్రతీ అడుగుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మరో వైపు.. విపక్ష పార్టీలు.. దీన్నో అస్త్రంగా చేసుకున్నాయి. విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో అగ్రిగోల్డ్ఆస్తులను జప్తు చేసి వేలం వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున ముందుగా చిన్న మొత్తంలో డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నిజానికి అగ్రిగోల్డ్ డిపాజిట్ల విశ్వరూపం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు సాగింది. అప్పట్లో సహకార శాఖను నిర్వహించిన .. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ… అగ్రిగోల్డ్ కు సంపూర్ణ సహకారాలు అందించారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు వారే… ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా ప్రభుత్వమే.. బాధితులకు చెల్లింపులు చేయాలనుకుంటోంది. అయితే.. ఇప్పుడు.. ఇలా ఇస్తే.. తర్వాత బోర్డు తిప్పేసే కంపెనీలకూ.. ప్రభుత్వమే చెల్లించాలనే డిమాండ్లు పెరుగుతాయి. ఇది ఎంత వరకు మంచిదో.. రాజకీయ పార్టీలే ఆలోచించాలి. అక్రమాలకు పాల్పడే కంపెనీల ఆట కట్టించాలి కానీ… వారి వల్ల బలైపోయిన వాళ్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం అంటే.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే..!