ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపుగా ఇరవై ఒక్క కోట్లు ఉంటుంది. ఆ ఇరవై ఒక్క కోట్ల మందికి యూపీ ప్రభుత్వం ఏడు నెలల్లో పెట్టిన ఖర్చు రూ. లక్షా యాభై రెండు వేల కోట్లు. యూపీ జనాభాలో… నాలుగో వంతు అంటే… ఐదు కోట్ల మంది అటూ ఇటూ ఉండే ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. లక్షా పదిహేడువేల కోట్లు. అంటే యూపీ ప్రభుత్వం సగటున ఒక్కో పౌరునిపై ఏడు నెలల్లో పెట్టిన ఖర్చు రూ. 7200 మాత్రమే. అదే ఏపీ ప్రభుత్వం ఏడు నెలల్లో ఒక్కో పౌరునిపై పెట్టిన ఖర్చు రూ. 23400. అంటే.. మూడు రెట్లు కన్నా ఎక్కువే. ఒక్క యూపీతోనే కాదు.. దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఏపీ సర్కార్ చేస్తున్న ఖర్చులో అత్యధిక భాగం సంక్షేమ పథకాలకు నగదు బదిలీలకు పోతోంది. మిగిలినది.. జీతభత్యాలకు వెళ్తోంది. అభివృద్ది పనులు మాత్రం పెద్దగా సాగడంలేదు.
ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ ఆదాయ వనరులు తక్కువే. ఆదాయం కూడా తక్కువే. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. అయినా ప్రభుత్వం వెక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే కొన్ని ఇతర రాష్ట్రాల్లోనే పన్నుల రూపంలో లభించిన ఆదాయం ఎక్కువే. ఆయా రాష్ట్రాలు చేసిన ఖర్చుతో పోలిస్తే.. ఏపీ దరిదాపులకు కూడా రారు. బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నదీ ఏపీ మాత్రమే. ఆదాయం తక్కువే అయినా… ఖర్చు ఎలా సాధ్యం అని చాలా మందికి డౌట్ రావొచ్చు కానీ.. ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడంలో సృజనాత్మకత చూపిస్తోంది. ఎంత కావాలంటే అంత అప్పు సృష్టించుకుంటోంది.,
ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చులో ఎక్కువ భాగం అప్పుల రూపంలోనే తెచ్చుకుంది. ఖర్చు చేసిన ప్రతి వందలో రూ. రూ.51 అప్పు. ఇతర రాష్ట్రాలు ఇలా అప్పులు తెచ్చుకోవడంలో వెనుకబడ్డాయి. ఫలితంగా ప్రజల కోసం ఖర్చు చేయలేకపోయాయి. ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో పట్టుదల ప్రదర్శిస్తోంది. కరోనా ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడినా… ఆదాయం తగ్గిపోయినా.. ప్రజలపై పడకూడదని నిర్ణయించుకుంది. అదే రీతిలో ఖర్చు చేస్తోంది.