ఓలా సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతోంది. నేరుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఇస్తారు. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ఎస్ వన్ ప్రో మోడల్ కొనాలని యాప్లో ప్రయత్నిస్తే… హైదరాబాద్లో అన్ని ఖర్చులూ కలిపి 1 లక్షా 80వేలు చూపిస్తోంది. అదే గుంటూరులో డెలివరీ ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం రూ. రెండు లక్షలపైనే చూపిస్తోంది. ఎక్కడా తేడా వచ్చిందంటే.. రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ దగ్గర. తెలంగాణలో రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ఐదు వందల రూపాయలు ఉంటే… ఏపీలో ఏకంగా ఇరవై వేల పైనే ఉంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వాహనాలపై ఏపీలో పూర్తి స్థాయిలో పన్ను బాదేస్తున్నారు. తెలంగాణలో మాత్రం రాయితీలు ఇస్తున్నారు.
పన్నులు పిండుకోవడంలో చాన్స్ వస్తే దేన్నీ వదులుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై వాజీవితకాల పన్ను 12శాతం విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యుత్ వాహనాల రేట్లు భారీగా పెరిగాయి. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం తగ్గించే చర్యల్లో భాగంగా 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ప్రకటించింది. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్షరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా 40శాతం వరకు రాయితీ సౌకర్యం ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయించారు.
ఆదాయం కోసం రాష్ట్రంలో వివిధ రకాల విద్యుత్ వాహనాలపై జీవిత పన్ను వసూలు చేస్తూండటంతో కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. రూ.లక్ష విలువైన బైకుపై రూ.12వేలు జీవిత పన్నుగా చెల్లించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్రోలు రేట్లు ఏపీలో అధికంగా ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బైకులు కొనుగోలు చేయాలన్న వాహనదారులకు ప్రభుత్వం మరో విధంగా పిండుకుంటోంది.