న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయవ్యవస్థపై వ్యవస్థీకృతంగా జరిగిన దాడిగా… దీని వెనుక పెద్ద హస్తాలు ఉన్నాయన్న సంకేతాలు… ఇంకా నిందితులు దొరకకపోవడం వంటి కారణాలతో వారికి బెయిల్ దక్కడం లేదు. ఇప్పటికే రెండు నెలలకుపైగా చాలా మంది జైల్లో ఉన్నారు. వారికి దిగువకోర్టులో బెయిల్ లభించలేదు. హైకోర్టులోనూ లభించలేదు. నిజానికి వారు దాడి చేసిన వ్యవస్థ వద్దకే వారు బెయిల్ కోసం వచ్చారు. వారికి ఊరటలభిస్తుందని ఎవరూ అనుకోలేదు.
తమ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంటుంది. ఇప్పటికీ కామెంట్లు ఏ మాత్రం తగ్గకపోవడం.. వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని కొంతమంది అధికార పార్టీ నేతలు అంటూ ఉండటం… పంచ్ ప్రభాకర్ వంటి వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరూ ఏమీ చేయలేరని సవాళ్లు విసురుతూండటంతో ఈ అంశం క్లిష్టంగా మారింది. పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన తర్వాత అసలు మొత్తంగా వీరి వెనుక ఎవరున్నారు… అనేది సీబీఐ తేల్చే అవకాశం ఉంది.
అంత సామాన్యంగా ఈ అంశాన్ని హైకోర్టు వదిలి పెట్టలేదని భావిస్తున్నారు. న్యాయవ్యవస్థపై దాడికి పురికొల్పిన వారిని పట్టుకునే వరకూ సీబీఐని కూడా హైకోర్టు పరుగులు పెట్టించే అవకాశం ఉంది. అందుకే ఈ కేసు విషయంలో నిందితులు జైళ్లలో మగ్గడం మాత్రమే కాదు.. వారికి ఆ గతి పట్టించిన సూత్రధారులుకూడా అక్కడికి వచ్చే పరిస్థితి త్వరలో ఏర్పడుతుందని న్యాయవర్గాలు నమ్ముతున్నాయి.