తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ విడుదల, సీట్ల కేటాయింపుల హడావుడి జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రాలో కూడా ఎన్నికల పనులు మొదలౌతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ వ్యూహ కమిటీతో మీటింగ్ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయి, ప్రభుత్వం నుంచి జరుగుతున్న మంచి పనుల్ని ప్రజల్లోకి ఎవరైతే బలంగా తీసుకెళ్లి దగ్గరౌతున్నారో వారికే సీట్లు దక్కుతాయన్నారు. అంతేకాదు, తాను చేయించుకుంటున్న సర్వేల ప్రకారం సీట్లు ఇస్తానని అనడంతోపాటు, కొంతమందికి మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.
కేంద్రం నుంచి సాయం లేకపోయినా, రాష్ట్రానికి నిధులు కొరత ఉన్నా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తున్నామనీ, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలతో ముఖ్యమంత్రి చెప్పారు. రాజకీయాలను అభివృద్ధినీ సంక్షేమాన్ని వేరు చేసి మాట్లాడలేమనీ, అన్నింటినీ కలిపి చూడాల్సిందేనని కూడా ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.
ఇంకోపక్క, ఎన్నికల అధికారి సిసోడియా కూడా ఓ ప్రకటన చేశారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామనీ, వీవీ ప్యాడ్లను బుధవారం నుంచి దశలవారీగా తెప్పిస్తున్నామనీ, ఈవీఎంలకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని ఆయన చెప్పారు. ఫిబ్రవరి మూడో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. నిజానికి, ఇది షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్న ఎన్నికలే. కాకపోతే, ఇప్పట్నుంచీ ఏర్పాట్లు మొదలుపెడితేగానీ… అప్పటికి పూర్తి కావు. ఏదేమైనా, ఏర్పాట్ల గురించి ఎన్నికల అధికారి, పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేరోజున స్పందించడంతో ఏపీలో కూడా ఎన్నికల హీట్ మొదలైనట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక, ప్రతిపక్ష నేత జగన్ అయితే పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఎన్నికల మూడ్ లోనే ఉంటున్నారు. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కూడా యాత్రల పేరుతో ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి.