ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో తీసుకెళ్తున్నారని వైసీపీ నేతలు చెబుతూంటారు. అది నిజమేనని అప్పుడప్పుడూ రికార్డులు వెలుగులోకి వస్తూంటాయి. తాజాగా ఏపీ టాప్ త్రీలో నిలిచింది. చిన్నపిల్లల అక్రమ రవాణాలో ఈ ఘటన సాధించింది. తొలి రెండు స్థానాల్లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి. ఇవి రెండు జనాభాలోనే చాలా పెద్ద రాష్ట్రాలు. ‘భారత్ చిన్నారుల అక్రమ రవాణా’ పేరుతో గేమ్స్ 24X7 అనే స్వచ్ఛంద సంస్థ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్ధి స్థాపించిన కేఎస్సీఎఫ్ సహకారంతో అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాజా నివేదిక ఆదివారం విడుదల చేసింది.
పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి కేఎస్ సీఎఫ్ తోపాటు దాని అనుబంధ సంస్థల వద్ద 2016 నుంచి 2022వరకు ఉన్న సమాచారాన్ని గేమ్స్ 24×7 సేకరించింది. అందులో 21 రాష్ట్రాల్లో బిహార్ ఆరేళ్ల కాలంలో మొత్తం 4245 కేసులు వెలుగు చూడగా.. యూపీలో 3836 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 734 కేసులకు నమోదు కాగా.. వాటిలో గుంటూరు (208), నెల్లూరు (125), శ్రీకాకుళం (98), కర్నూలు (74), భీమవరం (28)లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవన్నీ అధికారికంగా నమోదైన రికార్డులే. అనధికారికంగా అంటే నమోదు కానీ కేసులు ఎన్ని ఉన్నాయో చెప్పడం కష్టం .
ఇటీవల మహిళల అక్రమ రవాణా విషయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆ తర్వాత నిజమేంటి అని చర్చించుకున్నారు. ఇటీవల పార్లమెంట్ లో పవన్ చెప్పినట్లుగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తేలింది. అయితే చాలా మందిని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఏపీ పోలీసుల మాటల్ని ఇప్పుడెవరూ నమ్మడం లేదు. పరిస్థితి అలా మారిపోయింది. జాతీయంగా వెల్లడవుతున్న నివేదికల్ని చూసి… జాగ్రత్త పడటమే మిగిలింది.