హైదరాబాద్: ఏపీ ఇంటలిజెన్స్ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి శారీరక ఆరోగ్య పరిస్థితిగురించి ఆరా తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఈ నెల 15వ తేదీలోపు ప్రత్యేకహోదా ప్రకటించకపోతే నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించిన దృష్ట్యా పోలీస్ వర్గాలు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. జగన్ మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశామని, ఆయన వివరణ సంతృప్తికరంగా లేనందున తాము హోదాపై ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పదిహేనో తేదీన గుంటూరులో ఈ దీక్షకు కూర్చుంటానని తెలిపారు. ఓటుకు నోటు కేసునుంచి బయటపడటానికిగానూ చంద్రబాబు కేంద్రంతో రాజీపడుతున్నారని ఆరోపించారు.
జగన్ చేసిన ఈ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంలో గుబులు పుట్టించినట్లు కనబడుతోంది. ఈ దీక్షతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి జగన్‌కు అనుకూలంగా మారుతుందా అని తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయమని ఇంటలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. జగన్ దీక్షలో కూర్చుంటే ఎన్నిరోజులు కూర్చోగలడు, అతని శారీరక సహనశక్తి ఎలా ఉంటుంది తదితర వివరాలను ఇంటలిజెన్స్ పోలీసులు తెలుసుకుంటున్నారు. జగన్ ఇంతకుముందు 2011లో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై వారంరోజులపాటు నిరాహారదీక్ష చేసినట్లుకూడా పోలీసులకు సమాచార సేకరణలో తెలిసింది. ఈ సమాచారంతో ప్రభుత్వం తమ ప్రతివ్యూహాలకు పదును పెట్టనుంది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి కొద్దిరోజులక్రితం అనంతపూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదాపై తెలుగుదేశంకానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌గానీ మాట్లాడటంలేదని, వారికి మోడి అంటే భయమని విమర్శలు చేశారు. ఈ హోదాకోసం తాను పార్లమెంట్లో పోరాడతానని, దీనిపై ఉద్యమానికి ఏమికావాలన్నా చేయటానికి తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. నాటి రాహుల్ పర్యటన బాగా విజయవంతమైందికూడా. అప్పటివరకు ప్రత్యేకహోదాపై పెద్దగా పెదవి విప్పని జగన్, రాహుల్ వ్యాఖ్యలతో కాక పుట్టిందో ఏమో, ఆ రోజునుంచి ప్రత్యేక హోదాపై స్పీడు పెంచారు. ఇదే విషయంపై ఢిల్లీలో దీక్ష చేశారు. మొన్న రాష్ట్ర బంద్ నిర్వహించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీనిపై రాజకీయంగా లబ్దిపొందటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే నిరవధిక దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు.