మన ఆస్తి పత్రాలు మన దగ్గరే ఉంటాయి. తాకట్టు పెట్టుకోవాలంటే వారికి ఇస్తాము. ఇక నుంచి ఏపీలో ప్రజలకు ఆ అవకాశం ఉంటుందో ఉండదో చెప్పడం కష్టం. ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో కలర్ జిరాక్స్ లు మత్రమే ఇస్తున్నారు. అసలు పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. కార్డ్ ప్రైమ్ అని కొత్త సాఫ్ట్ వేర్ తో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. దీని వల్ల వచ్చే సమస్యల్లో అత్యంత ముఖ్యమైనదిగా ఈ ఆస్తి డాక్యుమెంట్ల గురించి బయటకు వచ్చింది.
మన ఆస్తి పత్రాలు మన దగ్గర లేకపోతే.. మన ఆస్తి మన దగ్గర ఉందని ఎవరికీ అనిపించదు. కానీ జిరాక్స్ లు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడైనా కావాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే స్పెసిమన్ కాపీలు ఇస్తారు. మరి ఇవి బ్యాంకుల్లో పెట్టుకోవడానికి పనికి వస్తాయా అంటే.. క్లారిటీ లేదు. ఇతరుల వద్ద తాకట్టు పెట్టుకుంటానికి అయినా పనికి వస్తాయా అన్నదానిపై క్లారిటీ లేదు.
నిబంధనల ప్రకారం.. వర్జినల్స్ తప్ప జిరాక్స్ లు ఏ బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు తీసుకోవు. అంతకు మించి ప్రభుత్వం వద్ద ఉంటే.. ఎప్పుడు ఎలా ట్యాంపర్ చేస్తారోనన్న భయాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టే ఆలోచన చేస్తోందా అన్న అనుమానాలు కూడా కొందరిలో వస్తున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజల అనుమానాలను తీర్చకపోతే.. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే అవకాశం కనిపిస్తోంది.