అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఏపీకి పెట్టుబడులు అవసరం అని గుర్తించి విశాఖలో ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించింది. అసలు పెట్టుబడుల ప్రయత్నమే చేయని ప్రభుత్వం మొదటి సారి ప్రయత్నిస్తోందని రాష్ట్రం కోసం అంటూ చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. కానీ అసలు పెట్టుబడుల సదస్సు పేరుతో జరిగిన వ్యవహారాలు చూసి ఇప్పుడు రగిలిపోతున్నారు. జీఐఎస్ పేరుతో గోల్ మాల్ వ్యవహారం నడిపారని అంటున్నారు. ఇలా వారికి అనిపించడానికి పది కారణాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.
పెట్టుబడి సామర్థ్యం లేని కంపెనీల ఎంవోయూలు !
ఏపీ ప్రభుత్వం పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకుంది. పెడితే పెట్టారు లేకపోతే లేదు.. ముందుగా ఓ ఎంవోయూ మార్చుకుందామని పరిచయం ఉన్న కంపెనీలను అడిగి ఈ తంతు నడిపించినట్లుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే.. లక్లలు .. వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పిన కంపెనీల చేతుల్లో ఇప్పటికిప్పుడు చేతిలో కనీసం పది కోట్లు లేని పరిస్థితి. వాటి ఏడాది లాభం… రూ. కోటి కూడా ఉండని కంపెనీలు ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా కొన్ని రెట్లు ఎక్కువ పెట్టుబడి పెడతామని ఎంవోయూలు చేసుకున్నారు. ఎవరైనా నమ్ముతారా ?
గ్లోబల్ పెట్టుబడిదారులంటే పులివెందుల కంపెనీలా ?
అసలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీల్లో పులివెందుల కంపెనీలు భారీ పెట్టుబడులు ప్రకటించడం మరో కారణం.. ఇండోసోల్ కంపెనీ పులివెందుల కు చెందిన వాళ్లది. అసలు యజమానులెవరో బయట ప్రపంచంలో అందరికీ తెలుసు. ఏడాదికి రూ. కోటి లాభం కూడా చూపించుకోలేని కంపెనీ లక్ష కోట్లు ఎలా పెడుతుంది. ఇంకో సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ సంస్థకు ఇప్పటికే ప్రజాధనం వేల కోట్లు దాచి పెడుతున్నారు. ఇక్ అవాడా అనే మరో కంపెనీ కూడా పులివెందులలోనే వ్యాపారం చేస్తోంది. విద్యుత్ ప్రాజెక్టు ఉంది. ఇలా అత్యధికం పులివెందులతో లింక్ అయి ఉన్నాయి.
దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎందుకు హాజరు కాలేదు ?
అడిగితే రాజ్యసభ సీటు ఇచ్చారన్న మొహమాటంతో ముకేష్ అంబానీ వచ్చారు. కానీ పెట్టబడుల ప్రకటన చేయలేదు. ఆయనే కాదు .. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలైన టాటాలు, బిర్లాలు, మహింద్రాలు మాత్రమే కాదు.. నీతి, నిజాయితీగా కార్పొరేట్ సామ్రాజ్యం నడుపుతున్న వారెవరూ గ్లోబల్ సమ్మిట్ జోలికి రాలేదు. వారెవరూ పెట్టుబడులు కూడా ప్రకటించలేదు. నిజానికి హీరో .. హెచ్ సీఎల్, కియా అనుబంధ పరిశ్రమలకు ఎన్నో ప్రణాళికలున్నాయి. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే…. తయారీ, సేవా రంగాలకు చెందిన వారు ఎవరూ రాలేదు. చివరికి క్యాంపస్ పెట్టడానికి సిద్ధమైన ఇన్ఫో సిస్ నుంచి కూడా స్పందన లేదు.
అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వారు… ఒకే సామాజికవర్గం వారే పెట్టుబడిదారులా ?
ఎంవోయూలను పరిశీలిస్తే… ఒక్కటంటే ఒక్కటీ నమ్మదగ్గ కంపెనీ కాదు. అక్రమాస్తుల కేసుల్లో ఉన్న హెటెరో, అరబిందో పెట్టుబడుల ఎంవోయూలు ప్రకటించాయి. రెడ్డీస్ ల్యాబ్స్ నుంచి వచ్చారు కానీ.. రూపాయి కూడా పెట్టుబడి ప్రకటించలేదు. వచ్చిన పారిశ్రామికవేత్తల్లో అత్యధిక మందికి రెడ్డి ట్యాగ్ ఒకటి ఖాయం. ఎలా చూసినా పెట్టుబడిదారులు.. గ్లోబల్ లోకల్ కూడా కాదు… ఒక వర్గం అన్నట్లుగా మారింది.
పాత పెట్టుబడులకే మళ్లీ ఎంవోయూలా ?
ఇన్వెస్ట్ మెంట్ సదస్సులో చేసుకున్న ఎంవోయూలు కొత్తవా అంటే.. అన్నీ పాతవే. తాడేపల్లిలో అవే చేసుకుంటారు.. దావోస్ వెళ్లి అవే చేసుకుంటారు.. మళ్లీ విశాఖ పెట్టుబడుల సదస్సులోనూ అవే చేసుకుంటారు ఇలాంటి పెట్టుబడులను ఎవరైనా నమ్ముతారా ? దీని కోసమా సదస్సు నిర్వహించింది.
గ్రీన్ ఎనర్జీకి అంత సీన్ ఉందా ?
చేసుకున్న పెట్టుబడుల ఎంవోయూల్లో 80 శాతం గ్రీన్ ఎనర్జీ రంగంలోనే. లక్షల మెగావాట్లు ఉత్పత్తి చేస్తామని ఆయా సంస్థలు చెప్పినట్లుగా ప్రభుత్వం ప్రకటించుకుంది. నిజానికి యూనిట్ ఉత్పత్తి ఖర్చు డిమాండ్.. ఆదాయంతో పోలిస్తే.. అదంతా పెద్ద ఫేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పది వేల మెగా వాట్ల కోసం టెండర్లు పిలిచి ఇప్పటికీ భూములు ధారదత్తం చేసిన కంపెనీలు అదానీ గ్రీన్, గ్రీన్ కో కంపెనీలు ఎంత మేర పనులు చేశాయో ఎవరికీ తెలియదు. అదానీ పనులాపేసింది. ఇప్పుడు ఇండోసోల్ , అవాడా , షిరిడి సాయి అనే పేర్లతో తెరపైకి వస్తున్నారు.
లక్షల ఎకరాల భూములు ఇచ్చేస్తామని ఎలా చెబుతున్నారు ?
గ్రీన్ ఎనర్జీ సంస్థలు కల్పించే ఉద్యోగాలు తక్కువ. కానీ భూములు మాత్రం వేల ఎకరాల్లో కావాలి. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రాలు… ఇలాంటి విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లోనే ఆ పరిస్థితి ఉండదు . కానీ ఇక్కడ మాత్రం లక్షల ఎకరాల భూములను కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పెద్ద భూస్కాం అనే ఆరోపణలు ఈ కారణంగానే వస్తున్నాయి.
ఐ ప్యాక్ ఈవెంట్లా పెట్టుబడుల సదస్సు నిర్వహించడం ఏమిటి ?
పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలు విమానాల్లో తరలి వస్తారని.. రాజమండ్రిలో కూడా విమానాల పార్కింగ్ అని సొల్లు చెప్పి.. చివరికి నాలుగైదు విమానాల్లో కూడా ఎవరూ రాని పరిస్థితి. అందులే వాలంటీర్లను కూడా పంపి.. గందరగోళం సృష్టించారు. ఐ ప్యాక్ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప… సదస్సు నిర్వహణ ఎంత దారుణంగా ఉంది… హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిన జర్నలిస్టులకు కళ్ల ముందు కనిపించలేదా ?. ఐ ప్యాక్ డ్రామాలా వ్యవహారం సాగిపోయింది.
ముఖ్యమంత్రి తీరు అంత నెగెటివ్ గా ఎలా ఉంది ?
సదస్సులో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కూడా పారిశ్రామికవేత్తల్ని ఆశ్చర్య పరిచింది. ఎవరైనా ఏమైనా అడుగుతారేమో.. చెప్పాల్సి వస్తుందేమో అన్నట్లుగా అయన .. ఎవరూ ఏమీ అడగకుండా తప్పించుకు తిరిగారు. అంబానీతో మాత్రమే రాసుకు పూసుకు తిరిగారు. మిగతా అంతా… ఆయన తీరుతో… ఆశ్చర్యపోయారు.
డెలిగేట్స్ పేరుతో ఆ ప్యాక్ టీముల్ని దించాల్సిన అవసరం ఏమిటి ?
అది పెట్టుబడిదారుల సదస్సు. కుప్పలు కుప్పలుగా జనం వస్తారని ఎవరూ అనుకోరు. కానీ తమ సదస్సుకు పన్నెండు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని.. అదేదో వైసీపీ ప్లీనరీ అన్నట్లుగా నిర్వహించారు. చివరికి అది ఐ ప్యాక్ టీమ్ ఈవెంట్ గా మారిపోయింది. ఇంత హడావుడి చేయడంతో సదస్సు తేలిపోలేదా ?