ఇనెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడుల సంగతి పక్కన పెడితే.. ఆ ఈవెంట్ కు చేసిన ఖర్చుపై మాత్రం జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఓ వైపు గ్రామాల్లో ట్యాంకర్ నీళ్లను సరఫరా చేసిన దానికీ బిల్లులివ్వడం లేదని చిన్న కాంట్రాక్టర్లు మండి పడుతున్నారు కానీ ముందుగా డబ్బులు చెల్లించి మరీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లను టైమ్స్ నెట్ వర్క్ ద్వారా చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లు మొత్తాన్ని టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు అప్పగించారు. టెండర్లు పిలిచారా లేదా అన్న సంగతి ఎవరికీ తెలియదు.. . కానీ వారి పంట పండింది. సదస్సు నిర్వహణకు మొత్తం రూ. 170 కోట్ల వరకూ ఖర్చయినట్లుగా చెబుతున్నారు ఇందులో టైమ్స్ వాటా రూ. వంద కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
టైమ్స్ నెట్ వర్క్ మీడియా సంస్థే అయినప్పటికీ ఇలాంటి ఈవెంట్స్ ను కూడా నిర్వహిస్తుంది. ఆ గ్రూపులో ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజెంట్ కంపెనీ కూడా ఉంది. ప్రభుత్వాలు ఇలాంటి ఈవెంట్ లను టైమ్స్ కు ఇస్తూంటాయి. దేశవ్యాప్తంగా పేరున్న మీడియా సంస్థ కావడంతో.. సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రభుత్వాలు ఇస్తూంటాయి. ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలకు ప్రజా ధనం వివిధ కారణాలతో పెద్ద ఎత్తున కట్టబెట్టిన జగన్ సర్కార్.. ఈ ఈవెంట్ ను టైమ్స్ కు ఇవ్వడం ద్వారా…. మీడియా మేనేజే మెంట్ లో కూడా అనుకున్నది సాధించినట్లయింది.
అయితే ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహణ పై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ కనీసం వెరీఫై చేయకుండా పాసులు ఇచ్చేశారు. పదిహేను వేల డెలిగేట్స్ పాసులు మంజూరు చేశారు. కంపెనీల ప్రతినిధులకే ఇవ్వాలి. మీడియా మేనేజ్ మెంట్ బాగానే చేశారు… హైదరాబాద్ నుంచి జర్నలిస్టుల్ని విమానాల్లో తీసుకెళ్లి..తీసుకొచ్చారు. కానీ సమావేశంలో వైఫై మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో సమస్య ఏర్పడింది. ఇలాంటి నిర్వహణలోపాలు చాలా ఉన్నాయి. ఎలాగైనా ఈవెంట్ అయిపోయింది… పెట్టుబడులు వచ్చాయో రాలేదో కానీ… టైమ్స్ పంట పండినట్లయింది.