ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ పెరిగేలా చేయడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చారు. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది.
లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదించారు. 500 చ.మీ. పైబడిన స్థలాలు, నిర్మాణాల్లో ఇక నుంచి సెల్లారుకు అనుమతి ఇస్తారు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లు తొలగిస్తూ జీవో జారీ చేశారు. అలాగే రాష్ట్ర, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీ.సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన కూడా తొలగించారు. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సులభం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వతా ప్రజల ఆస్తుల విలువల్ని పెంచడానికి.. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి విస్తృత చర్యలు చేపట్టింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోనుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఈ రూల్స్ మార్పు రియల్ఎస్టేట్ వ్యాపారులకూ అనుకూలంగా ఉంటుంది.