ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారంటూ.. పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విప్లవ రచయితల సంఘం నేత.. వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయన కోసం.. ఆంధ్రప్రదేశ్ నేతలు.. లేఖలు రాయడం ప్రారంభించారు. ఆయనకు బెయిల్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ… వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. అయితే భూమన దీన్ని పార్టీ తరపున కాకుండా.. వ్యక్తిగతంగా రాసి ఉంటారు. భూమనకు.., విప్లవం బ్లాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. ఆయనకు వరవరరావు అంటే అభిమానం ఉండొచ్చు. అంతకు ముందు.. వరవరరావుకు.. కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసిన తర్వాత అనూహ్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా స్పందించారు. ఆయనను విడుదల చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
మానవహక్కుల పోరాట భావజాలం ఉన్న వారికి.. వరవరరావు ఆదర్శం. ఆయన పెద్ద ఎత్తున రచనలు చేశారు. దీంతో సహజంగానే సోషల్ మీడియాలో.. ఈ మానవహక్కుల ఉద్యమకారులంతా.. వరవరరావు కోసం.. పోస్టులు పెడుతున్నారు. రాజకీయనేతలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాజకీయ నేతలు పూర్తిగా లైట్ తీసుకున్నారు. అయితే.. ఆంధ్రనేతలు మాత్రం.. వరవరరావు కోసం.. బహిరంగ ప్రకటనలు చేయడం మాత్రం ఆసక్తికరమే. కొన్నాళ్ల కిందట.. మహారాష్ట్రలోని బీమా-కోరెగాంలో ఘర్షణలు జరిగాయి. అక్కడ దళితులపై దాడులు జరిగాయి. కానీ ఆ ఘటన వెనుక మావోయిస్టులు ఉన్నారని పుణె పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తి దగ్గర ల్యాప్‌ట్యాప్‌లో లేఖ ఉందని.. ఏకంగా ప్రధానమంత్రిని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని..కేసులు పెట్టారు. అందులో వరవరరావు పేరు ప్రస్తావన ఉండటంతో.. ఆయనను అరెస్ట్ చేశారు.
వరవరరావుపై అత్యంత కఠినమైన UAPA కేసు నమోదు చేశారు. దేశంలో ఇప్పటికే..ఐదుగురి పై మాత్రమే ఈ యాక్ట్ నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసులు పెట్టడానికి అరెస్టులు చేయాడనికి.. పోలీసులు ఎలాంటి సాక్ష్యాలను చూపించాల్సిన అవసరం లేదు. ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. అందుకే వరవరరావు జైల్లోనే ఉన్నారు. 80 ఏళ్ల వరవరరావుకు కరోనా సోకడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై.. ఆయనకు సన్నిహితులు.. ఆయన భావజాలం నచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.