పులివెందులలో ఇద్దరిపై కాల్పులు జరిపి ఒకరిని హత్య చేసిన భరత్ యాదవ్ వ్యవహారం పోలీసు వర్గాల్లోనూ సంచలనం అవుతోంది. ఆ తుపాకీ ఎక్కడిదని మొదట చాలా మంది ఆరా తీశారు. కానీ పోలీసులు మాత్రం గుంభనంగా ఉన్నారు . చివరికి ఎస్బీ అన్బురాజన్ అది తాము ఇచ్చిన లైసెన్సుడ్ తుపాకీనేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. భరత్ యాదవ్ గురించి పులివెందులలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన మట్కా , దందాలు, సెటిల్మెంట్లు చేస్తూంటాడు. అలాంటి వారికి గన్ లైసెన్స్ ఇస్తే ఏం జరుగుతుందో పోలీసులకు తెలుసు. అందుకే డీఎస్పీ గన్ ఇవ్వవొద్దని సిఫారసు చేశారు.
అయితే పై స్థాయిలో అనుమతులు ఇచ్చేశారు. సాక్షుల రక్షణ పథకం కింద గన్ లైసెన్స్ ఇచ్చామని ఎస్పీ చెబుతున్నారు. వివేకా హ త్య కేసులో సీబీఐ ఆయనను ప్రశ్నించింది. తర్వాత సీబీఐ పై ఆయన చాలా ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీతనే వివేకాను హత్య చేసిందనే కథను… ఆయన ప్రెస్ మీట్లలో చెప్పడం.. దాన్ని సాక్షి మీడియా పెద్దగా ప్రచారం చేయడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. తన ప్రాణానికి హాని ఉందంటూ ఓ సారి ఆయన సీబీఐకి లేఖలు రాశారు. ఈ కారణంగానే ఆయనకు గన్ లైసెన్స్ ఇచ్చామని పోలీసులు సమర్థించుకుంటున్నారు.
ఆ గన్ తో భరత్ యాదవ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి., అయినా పోలీసులు మాత్రం ఏ కేసులు నమోదు కాలేదని అందుకే రివాల్వర్ వెనక్కి తీసుకోలేదని అంటున్నారు . అసలు మొత్తం పోలీసులకు ఏం జరుగుతుందో తెలుసుని.. ఏమీ తెలియనట్లుగా ఉంటున్నారని పులివెందుల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కేసులు పెడతామని ఎస్పీ నేరుగానే హెచ్చరించారు. పులివెందులలో ఇంకా ఎంత మందికి సాక్షుల రక్షణ స్కీం కింద గన్ లైసెన్సులు ఇచ్చారో కానీ… ముందుగా ఎస్పీనే కంగారు పడుతున్నారు.