భూమ్ ..భూమ్..! 10000 స్ట్రాంగ్..! టాప్ స్టార్ బ్రాందీ..ఓల్డ్ టైమర్ రమ్..! ఇవన్నీ.. ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు. కాస్త పేరున్న బ్రాండ్లకు ఫేక్ బ్రాండ్లలా కనిపిస్తున్న వీటిని మాత్రమే.. ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నాయి. వీటిని తయారు చేస్తున్న డిస్టిలరీలకు ఊరూ పేరూ ఉండటం లేదు. కానీ.. పెద్ద ఎత్తున సరుకు మాత్రం.. ప్రభుత్వ మద్యం దుకాణాలకు వచ్చి పడుతోంది. వీటితో పోలిస్తే… కాస్త ప్రమాణాలు పాటించే బ్రాండెడ్ కంపెనీల లిక్కర్ మాత్రం.. దొరకడం లేదు. వీటినే ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందో మాత్రం… ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో.. ఇలాంటి నోటికొచ్చిన పేర్లతో.. చీప్ లిక్కర్‌ను అమ్మేవారు. ఇప్పుడు అలాంటివే ప్రముఖ బ్రాండ్లుగా మారిపోయాయి.
ఏపీ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యంతో… అనారోగ్య సమస్యలు వస్తాయని.. అదంతా చీప్ లిక్కర్ అని.. ఏపీలో ఓ ప్రచారం ప్రారంభమయింది. దీన్ని వ్రతిపక్ష పార్టీలు అందుకున్నాయి. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన లిక్కర్ల వల్ల లివర్ పాడయిపోతుందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద.. మందుబాబులు కూడా.. తమకు కావాల్సిన బ్రాండ్ దొరకడం లేదని. గొడవలు చేస్తున్న దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. పోనీ వీటి ధర ఏమైనా తక్కువగా ఉందా అంటే.. అదీ లేదు. టాప్ బ్రాండ్ లిక్కర్ల కన్నా.. ఓ రూపాయి ఎక్కువే ఉంటుంది.
ప్రభుత్వం మద్యం కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆయా బ్రాండ్లు సరఫరా నిలిపివేశాయని ప్రభుత్వ వర్గాలు చెబుతూంటాయి. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. ఆయా కంపెనీలు.. జే ట్యాక్స్ కట్టడానికి నిరాకరించడం వల్లే.. కొనడం లేదని.. ఆరోపిస్తూంటారు. ఏదైనా.. అసలు రావాల్సిన మద్యం బ్రాండ్లు మాత్రం..ఏపీకి రావడం లేదు. ఊరూపేరూ లేని కంపెనీల చీప్ లిక్కర్ల దండయాత్ర మాత్రం సాగుతోంది. వీటిని తాగలేక.. జనం మద్యం మానేస్తారో లేదో కానీ.. తాగేవారు మాత్రం అనారోగ్యం పాలవుతారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.