ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పదిహేను శాతం పెంచారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. కానీ నిజానికి పెంచిందిన శాతాల లెక్కన కాదు. బాటిళ్ల లెక్కన. మద్యం దుకాణ యజమానులు తమకు మార్జిన్ సరిపోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. పెట్టిన పెట్టుబడికి తగినట్లుగా ఆదాయం లేదంటున్నారు. దీంతో వారి మార్జిన్ ను పెంచుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దానికి కవర్ చేసేందుకు ఇప్పుడు అసలు ధరపై రూ. పది రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు. అసలు ధర పెంపు కేవలం రూ. 10 మాత్రమే అని బ్రాండ్ లేదా పరిమాణం అంటే క్వార్టర్ / హాఫ్ / ఫుల్ బాటిల్ అనే దానితో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ 10 మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు. కొంతమంది 15 శాతానికిపైగా పెరిగిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ అని స్పష్టం చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.
అదే సమయంలో బీరుతో పాటు రూ 99 మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదని ఎక్సైజ్ కమిషనర్ ప్రకటించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జే బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. అన్నీ పేరున్న బ్రాండ్ల లిక్కరే అమ్ముతున్నారు. అది కూడా రూ. 99 క్వార్టర్ లిక్కర్ అమ్ముతున్నారు. గతంలో మందు బాబులు తమ సంపాదనలో సగం మద్యానికి ఖర్చు పెట్టాల్సి వచ్చేది. వారి ఆదాయాన్ని మిగిల్చేందుకు ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకంగా తక్కువ ధర మద్యం అందుబాటులోకి తెచ్చింది.