ఏపీలో బెల్ట్ షాపులు అనేవే ఉండకూడదని.. గురువారం సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆదేశాలు జారీ చేశారు. స్పందన లాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడమే దీనికి కారణం. అసలు ఈ బెల్ట్ షాపులు ఇప్పుడు ఏపీలో ఎలా సాధ్యమన్నది మాత్రం.. ఊహకు అందనిది. ఎందుకంటే.. ఇప్పుడు మద్యం అమ్ముతోంది నేరుగా ప్రభుత్వమే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే మద్యం లభిస్తోంది. గతంలో ఉన్న షాపుల్లో ఇరవై శాతం తగ్గించి.. మరీ దుకాణాలు ఏర్పాటు చేశారు. అందులో పని చేస్తున్నవారు ఉద్యోగులే. టైం టు టైం పని చేసి ఇంటికెళ్లిపోతారు. బెల్టు షాపులు పెట్టి మరీ అమ్మే పరిస్థితి ఉండదు. కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే.. సమీక్షలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ అధికారులకు దీనిపై స్పష్టంగా దిశానిర్దేశం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టుషాపులు నడవకూడదని, మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ఆదేశించారు. పోలీసులు ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదన్నారు. గ్రామాల్లో 11 వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారని వీరిని శక్తివంతంగా వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వారందరికీ మొబైల్ ఫోన్లు ఇచ్చామని, ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెప్పించుకోవాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసులు ప్రాథమిక విధిగా భావించాలని.. అలాగే మహిళా మిత్రలు కూడా ఉన్నారని, వీరిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలని కూడా ఆదేశించారు.
సాధారణంగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నప్పుడు.. వారు అమ్మకాలను పెంచుకోవడానికి తమ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేసేవారు. దానికి ఎక్సైజ్ అధికారులు కూడా సహకారం అందించేవారు. ఇప్పుడు.. ప్రభుత్వ దుకాణాలు ఉన్నా. బెల్టు షాపులు ఉన్నాయంటే.. ఖచ్చితంగా ఎక్సైజ్ సిబ్బంది నిర్వాకమే అవుతుంది. అమ్మకాల టార్గెట్లు ఉంటే.. వారువీటిని చూసీ చూడనట్లుగా ఉంటారు. ఇప్పుడు మాత్రం వీరే నిర్వహిస్తున్నట్లుగా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.