ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదు. ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్దకు వెళ్లిపోతోంది. అక్కడ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఎంత అవకాశం వస్తే అంత తీసుకుంటోంది. గత వారం రూ. మూడు వేల కోట్లు తీసుకుని ఉద్యోగాలకు జీతాలు పంపిణీ చేయగలిగిన ఏపీ.. ఈ వారం.. మరో రూ. రెండు వేల కోట్లను రుణంగా తీసుకుంది. ప్రభుత్వానికి ఖర్చులు ఎక్కువగా ఉండటం.. ఆదాయం పడిపోవడంతో ఎక్కడ నిధులు లభించినా తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వడ్డీ ఎంతన్న విషయాన్ని ప్రభుత్వం అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ మంగళవారం ఆర్బీఐ దగ్గర అప్పు కోసం దాదాపుగా పది రాష్ట్రాలు బాండ్ల వేలం వేశాయి. ఇందులో అత్యధిక వడ్డీకి రుణం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రుణ కాల పరిమితి ఎక్కువగా పెట్టుకుంటూండటంతో ఈ సమస్య వస్తోంది.
ప్రస్తుతం.. ఏపీ సర్కార్ ఈ నెలలో పదకొండో తేదీన డ్వాక్రా మహిళల రుణమాఫీ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. దీనికి రూ. ఆరేడు వేల కోట్లు కావాల్సి ఉంటుంది. 90 లక్షలమందికిపైగా ఉన్న డ్వాక్రా మహిళలకు .. రుణమాఫీ చేస్తానని జగన్ ప్రకటించారు. ఈ ప్రకారం ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 18750 ఇవ్వాల్సి ఉంది. దీనికి వైఎస్ఆర్ ఆసరా అని పేరు పెట్టారు. సంక్షేమ షెడ్యూల్లో భాగంగా… పదకొండో తేదీన అందరికీ నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు. దాని కోసం… ఇప్పుడు నగదు సమీకరణ జరుగుతోంది. ఎక్కడ అప్పులకు అవకాశం ఉంటే అక్కడ చేస్తున్నారు. ఆర్బీఐ నుంచి అవకాశం ఉన్న మేర అప్పులు తెచ్చుకుంటున్నారు.
శరవేగంగా సంస్కరణలు అమలు చేయడం ద్వారా.. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుకోగలగితే.. మరింత వెసులుబాటు వస్తుందని .. అప్పటి వరకూ మరింతగా వడ్డీ ఎక్కువ అయినా.. ఆర్బీఐ వద్ద నుంచి అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి అవసరాలు తీరతాయి కానీ… ఏపీ ఆర్థిక భవిష్యత్‌కు మాత్రం.. ప్రభుత్వ వ్యూహం .. ఇబ్బందికరమేనన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.