లాక్డౌన్ వల్ల మూసివేతకు గురైన మద్యం దుకాణాలను.. నాలుగో తేదీ నుంచి ఏపీ సర్కార్ తెలుస్తోంది. ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరోసారి పాతిక శాతం ధరలను పెంచింది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి.. షాపుల వద్ద రద్దీని తగ్గించడానికి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ మద్యం విధానం ప్రకారం.. ఈ ఏడాది కూడా ఇరవై శాతం మద్యం దుకాణాలు తగ్గించాల్సి ఉంది. ఈ దిశగా కూడా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఏపీలో మద్యం విధానాన్ని సంపూర్ణంగా మార్చేశారు. గతంలో దుకాణాలకు వేలంపాట ఉండేది. ఆ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. ఇరవై శాతం దుకాణాలు తగ్గించి.. రేట్లను.. పాతిక నుంచి 40 శాతం వరకూ పెంచింది. ఇప్పుడు ఏడాది కాకుండానే.. మరోసారి పాతిక శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో.. ప్రఖ్యాత బ్రాండ్లు ఏమీ ఉండవు. ఊరూపేరూ లేని బ్రాండ్లు ఉంటాయని.. మందుబాబులు కొద్ది రోజులుగా గోల చేస్తున్నారు. డిస్టిలరీలకు చెల్లించాల్సిన సొమ్ము బకాయిలు ఉండటం వల్లనే వారు మద్యం సరఫరా చేయడం లేదని ప్రభుత్వం చెబుతోంది.
మద్యం ధరలు పెంచితే.. సామాన్యులు కొనలేరన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. పేదలకు అందకుండా.. మద్యం రేట్లు పెంచితే.. డబ్బులున్నవారు మాత్రమే కొనుగోలు చేస్తారని భావిస్తోంది.అందుకే.. మద్యం రేట్లను భారీగా పెంచాలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇలా చేయడం వల్ల.. ప్రభుత్వానికి ఆదాయం కూడాతగ్గే అవకాశం లేదు. గత ఏడాది అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పటికీ.. ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగింది.