రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోయింది. ఆ ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన బోర్డుల గెజిట్లో చోటు దక్కలేదు. అంటే.. అసలు ఆ ప్రాజెక్ట్ ఉనికిని కేంద్రం గుర్తించలేదన్న మాట. పాత ప్రాజెక్టు అని చెబుతూ వస్తున్న ఏపీ సర్కార్కు ఇప్పుడు.. ఈ విషయం మింగుడు పడని అంశం . అసలు ఏ ప్రాజెక్టు కారణంగా.. మొత్తం వివాదం చెలరేగిందో..ఆ ప్రాజెక్టును అసలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో భవిష్యత్లో కూడా దాన్ని చేపట్టే అవకాశం ఉండదు. ఒక వేళ నిర్మించాలంటే.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయించుకుని.. ఆ మేరకు ఆమోదం తీసుకుంటేనే మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కట్టవద్దని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మా నీటిని మేం వాడుకుంటాం.. అంతకు మించి ఒక్క చుక్క వాడుకోబోమంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అసలు సమస్య ఇక్కడే ప్రారంభమయింది. ఏపీ కట్టి తీరుతామని చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం.. కేఆర్ఎంబీని.. చివరికి ఎన్జీటీని కూడా ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. స్టే ఉన్నా అక్కడ పనులు జోరుగా సాగుతున్నాయన్న ప్రచారం ఉంది. అందుకే సర్కార్ పై కోర్టు ధిక్కరణ కేసులు కూడా పడ్డాయి. కానీ ఇప్పుడు… అసలు కృష్ణా ప్రాజెక్టుల్లో.. ఆ ఎత్తిపోతలకు చోటులేదు. అంటే.. నీటి కేటాయింపులు ఉండవు.. నీళ్లు తోడుకోవడానికి చాన్స్ ఉండదు.
నదీ యాజమాన్య బోర్డులు…కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి కాబట్టి… ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత నీటిని విడుదల చేయాలనేది… ఆయా బోర్డులే నిర్ణయిస్తాయి. అవి ఒప్పందాల ప్రకారం ఉంటాయి. ఈ ప్రకారం నీటిని విడుదల చేస్తాయి. ఈ ప్రకారం చూస్తే… వేల కోట్లు పెట్టి రాయలసీమ ప్రాజెక్టు కట్టేసినా నీరు తోడుకోవడానికి చాన్స్ ఉండదు. అంటే…. ఆ వేల కోట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నమాట. ఏపీ సర్కార్.. ఏం చేసినా ఇలాగే అవుతూండటం… ఇదే మొదటి సారి కాదు.. ఇది చివరి సారి కూడా కాకపోవచ్చు.