ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మే 15వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మెగా డీఎస్సీ సంబంధించిన జీవో, టీచర్ పోస్ట్‌ల వివరాలు, ఎగ్జామ్ షెడ్యూలు, సిలబస్ పూర్తి వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు, ఇతర సమస్యల కారణంగా కాస్త ఆలస్యమైనా వచ్చే విద్యా సంవత్సరంలోపు నియామకాలు పూర్తి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సుదీర్ఘంగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో వేసిన డీఎస్సీ చివరిది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జనవరి ఒకటినే జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ పదేళ్ల కాలంలో ఒక్క సారి కూడా డీఎస్సీ ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పే వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అసలు ఖాళీలు లేవని చెప్పేవారు.
విద్యావ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే టీచర్లు చాలా ముఖ్యం. అయితే టీచర్లను కాదని.. నాడు – నేడు పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేశారు.కానీ ఒక్క స్కూల్ మెరుగుపడలేదు. ఐబీ, సీబీఎస్ఈ సహా ఎన్నో ఆర్భాటపు ప్రకటనలు చేసి పేద పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాగానే.. విద్యావ్యవస్థను గాడినా పెడుతోంది. టీచర్లను నియమించేందుకు ప్రయత్నిస్తోంది.