మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు గడుస్తున్నా… రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. హంగ్ కి అవకాశాలున్న స్థానాల్లో కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల ద్వారా ఓట్లు వేయించుకుని మద్దతును అధికార పార్టీ పెంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడే ఇప్పుడు వివాదం నెలకొంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులకు కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఇలానే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఓటు నమోదు చేసుకున్నారు. అంతేకాదు, ఆయన ఓటు వేయడంతో తుక్కుగూడ ఛైర్ పర్సన్ పదవిని తెరాస దక్కించుకుంది. కేకే ఓటు హక్కు వినియోగించుకోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది!
ఎందుకీ వివాదమంటే… సాంకేతికంగా కేశవరావు ఆంధ్రాకి చెందిన రాజ్యసభ సభ్యులు అవుతారు! రాష్ట్ర విభజన సమయంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపీలను కేటాయించారు. అప్పుడు ఏపీ ఎంపీగా కేకే వెళ్లారు, తెలంగాణ ఎంపీగా కేవీపీ రామచంద్రరావు వచ్చారు. అయితే, తెలంగాణలో కేకే ఉంటున్నారు, ఏపీలో కేవీపీలో ఉంటున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఎంపీ నిధులను సొంత ప్రాంతాలకే వినియోగించుకుంటామని రాజ్యసభ ఛైర్మన్ కి ఈ ఇద్దరూ అర్జీ పెట్టుకోవడం, ఆయన అనుమతించడం గతంలో జరిగిపోయాయి. ఇప్పుడీ మున్సిపల్ ఎన్నికకు వచ్చేసరికి ఏపీ కోటాలో ఉన్న కేకే తెలంగాణలో ఓటేయడమేంటనేది ప్రశ్న..? అలాగని, తెలంగాణ కోటాలో ఎంపీగా ఉన్న కేవీపీ కాంగ్రెస్ తరఫున ఓటు వినియోగించుకునే ప్రయత్నం చేస్తే… చాలా అడ్డంకులు కల్పించారు. నేరేడుచర్లలో ఆయన ఓటు వెయ్యడానికి వెళ్తుంటే ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు, అదో వివాదమై ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది.
కేవీపీ తెలంగాణ ఎంపీ కాబట్టి, ఆయన ఓటు వినియోగం మీద ఎలాంటి వివాదమూ లేనట్టే. కానీ, కేకే ఓటు వినియోగం సరైంది కాదనేది భాజపా వాదన. ఆంధ్రా ఎంపీతో తెలంగాణలో ఓటు వేయించడం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే అవుతుందని లక్ష్మణ్ ఆగ్రహిస్తున్నారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతూ ఉంటారనీ, ఇవేనా మీ విలువలు అంటూ ప్రశ్నించారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామనీ, ఆ తరువాత న్యాయపరంగా దీన్నెలా ఎదుర్కోవాలో అది కూడా ఆలోచిస్తామన్నారు. చివరికి, ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి.